పర్యాటక సందడి ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర ప్రదర్శనశాలలు, చారిత్రక ప్రదేశాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ మొదలైంది.

Updated : 02 Oct 2020 12:26 IST

హుస్సేన్‌సాగర్‌లో మొదలైన బోటింగ్‌
  నాగార్జున సాగర్‌లో నేటి నుంచి..

 హైదరాబాద్‌; నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర ప్రదర్శనశాలలు, చారిత్రక ప్రదేశాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ మొదలైంది. వాటర్‌ ఫౌంటెయిన్‌కు అనుమతిచ్చారు. 6 నెలల తర్వాత మొదలైన వీటిల్లో తొలిరోజు కొన్ని చోట్ల సందర్శకుల సందడి కనిపించింది. పర్యాటకశాఖ బస్సులకు బుకింగ్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ శిల్పారామంలో గురువారం పలు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం దీనిని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల మేరకు పర్యాటక కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్లు, శానిటైజర్లను ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రాలు నడుస్తాయని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. దుర్గం చెరువు సహా రాష్ట్రంలోని పర్యాటక జలాశయాల వద్ద బోటింగ్‌ను ప్రారంభిస్తామన్నారు. నాగార్జునసాగర్‌ జలాశయంలో లాంచీ ప్రయాణాలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి.  హిల్‌కాలనీ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన లాంచీ స్టేషన్‌ నుంచి.. నాగార్జునకొండకు, జలాశయంలో సరదా ట్రిప్పుల కోసం రెండు లాంచీలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. కొత్తగా రూ.50 లక్షలతో మరో లాంచీని సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని