‘ఢీ’హెచ్‌ఎంసీ

నగరాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలన్న నినాదాలతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మార్మోగింది. కొన్ని రోజులుగా కార్మికులు ఈ విషయమై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిరసనలు తెలుపుతుండగా..

Updated : 24 Aug 2023 05:04 IST

కార్మికులను క్రమబద్ధీకరించాలని ప్రతిపక్షాల డిమాండ్‌
భారాస కార్పొరేటర్లు సైతం మద్దతిస్తున్నారని మేయర్‌ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌, హిమయత్‌నగర్‌, న్యూస్‌టుడే: నగరాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలన్న నినాదాలతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మార్మోగింది. కొన్ని రోజులుగా కార్మికులు ఈ విషయమై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిరసనలు తెలుపుతుండగా.. బుధవారం జరిగిన 7వ సర్వసభ్య సమావేశం సందర్భంగా అన్ని పార్టీలు వారికి మద్దతు ప్రకటించాయి. సమావేశంలో పాల్గొనే ముందు భాజపా నేతలు కొప్పుల నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రవణ్‌, శ్రీవాణి, ఇతరత్రా చీపుర్లతో రోడ్డు ఊడ్చారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్లు రాజశేఖర్‌రెడ్డి, విజయారెడ్డి, రజితారెడ్డి సమావేశానికి ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశ మందిరంలోనూ భాజపా, కాంగ్రెస్‌ నేతలు కార్మికుల ఉద్యోగ భద్రతపై ఆందోళన చేపట్టారు. అలాగే వారికి రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలన్నారు. ఎంఐఎం నేతలు సైతం సానుకూలత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు భారాస కార్పొరేటర్లు సైతం మద్దతుగా ఉన్నారని ప్రకటించారు. బల్దియా పాలక మండలి డిమాండ్‌ను ప్రభుత్వానికి పంపుతామని మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ హామీ ఇచ్చారు.

మేయర్‌ ఆగ్రహం..

ఆరు నెలల అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను చర్చించాల్సిన అవసరముందని, పదే పదే సభ నిర్వహణను అడ్డుకుంటోన్న భాజపా, కాంగ్రెస్‌ నేతల తీరుపై మేయర్‌ పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష, పాలకపక్ష కార్పొరేటర్ల విమర్శ, ప్రతివిమర్శలతో ఉదయం 10గంటలకు మొదలైన సమావేశాన్ని మధ్యాహ్నం 2గంటలకు ముగిస్తున్నట్లు మేయర్‌ ప్రకటించారు.

చరిత్ర తెలియదనడంపై..

రూ.500 జీతంతో జీవితాన్ని ప్రారంభించిన పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు నేటికీ దుర్భరంగా ఉన్నాయని.. మేయర్‌కు చరిత్ర తెలియదని ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి వ్యాఖ్యానించడంపై భారాస నేత బాబా ఫసియుద్దీన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్‌ను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఇతర కార్పొరేటర్లు సైతం డిమాండ్‌ చేయడంతో.. కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామంటే క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమేనంటూ ‘సారీ’ చెప్పారు. ప్రొటోకాల్‌ విషయంపై పలువురు కార్పొరేటర్లు గళమెత్తగా మేయర్‌ స్పందించి.. నగరవ్యాప్తంగా ప్రొటోకాల్‌ సమస్య ఉందని, అధికారులతో ఈ విషయమై చర్చిస్తామన్నారు. భారాస కార్పొరేటర్లు సామల హేమ, సీఎన్‌రెడ్డి, తదితరులు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ఎస్సార్డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, లింకు రోడ్ల పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై అడిగిన ప్రశ్నలకు అధికారులు సవివరంగా సమాధానాలిచ్చారు. పాతబస్తీలో ఎస్‌ఎన్‌డీపీ కింద చేపట్టిన నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్‌ బేగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం భాజపా, కాంగ్రెస్‌ నేతలు మేయర్‌ కార్యాలయం ముందు బైఠాయించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బయట వదిలిపెట్టారు. అంతకు ముందు పాలక మండలి సమావేశాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు బల్దియా అధికారులు సమాధానాలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని