TS 10th Exams: బాధ్యతగా పని చేద్దాం.. చిన్నారులను గందరగోళానికి గురిచేయొద్దు: మంత్రి సబిత

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్‌ కావడంపై మంత్రి సబితా స్పందించారు. పరీక్షల నిర్వహణ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

Published : 04 Apr 2023 15:25 IST

హైదరాబాద్‌: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్‌ అవడాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై ఆరా తీసిన ఆమె.. వరంగల్‌, హనుమకొండ డీఈవోలతో ఇప్పటికే మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజులు వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై ఆమె స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వివిధ శాఖల అధికారులకు ట్విటర్‌ ద్వారా పలు సూచనలు చేశారు.

‘‘పదో తరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్‌, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేద్దాం. మొదటిసారి బోర్డు పరీక్షలు రాస్తున్న చిన్నారులను గందరగోళానికి గురిచేయాలని ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయ, వ్యక్తిగత స్వార్థాన్ని వీడాలి’’ అని మంత్రి సబిత విజ్ఞప్తి చేశారు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సాయంత్రం 5 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని