HCA: హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేస్తే ఊరుకోం: హెచ్‌సీఏపై మంత్రి ఫైర్‌

ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టిక్కెట్ల వ్యవహారంలో గందరగోళంగా మారింది.

Updated : 22 Sep 2022 17:07 IST

హైదరాబాద్‌: ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల వ్యవహారంలో గందరగోళంగా మారింది. జింఖానా గ్రౌండ్‌లో ఈరోజు జరిగిన టికెట్ల విక్రయాల్లో తోపులాట, లాఠీఛార్జితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హెచ్‌సీఏ తీరుపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సీరియస్‌ అయ్యారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తే సీఎం ఊరుకోరన్నారు. టికెట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జింఖానాలో జరిగిన తొక్కిసలాట, ఉప్పల్‌ మ్యాచ్‌ ఏర్పాట్లపై సమీక్షించేందుకు హెచ్‌సీఏ ప్రతినిధులు రావాలని ఆదేశించిన మంత్రి.. వారితో రవీంద్ర భారతిలో సమావేశమయ్యారు. ఈ భేటీకి హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు హాజరయ్యారు. అంతకుముందు టికెట్ల వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఈటీవీ ప్రతినిధితో ముఖాముఖిలో మాట్లాడుతూ హెచ్‌సీఏ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

టికెట్ల విక్రయం తొలి నుంచీ వివాదాస్పదంగా ఉంది. ఈ రోజు ఏం జరిగిందో మీరూ చూశారు. దీనిపై ఏమంటారు?

ఇది పూర్తిగా హెచ్‌సీఏ నిర్లక్ష్యం. వైఫల్యం. క్రికెట్‌ అంటే చాలా క్రేజ్‌. కోట్లాది మంది చూస్తారు.  లక్షలాది మంది ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ టికెట్ల కోసం ప్రయత్నిస్తారు. ఈ నెల 25న మ్యాచ్‌ ఉన్నప్పుడు పది రోజుల ముందే అన్ని ఏర్పాట్లు క్లియర్‌ చేసుకోవాలి కదా. ఇంకా కాకపోతే కనీసం వారం రోజులో, ఐదారు రోజుల ముందైనా చూసుకోవాలి. కానీ నిన్నటి వరకు టికెట్లు ఎక్కడ విక్రయిస్తున్నారో మాకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈరోజు అడిగితే రకరకాల సమాధానం చెబుతున్నారు. నిన్న మీడియా వేదికగానే హెచ్‌సీఏకు స్పష్టంగా చెప్పాం. ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మి దందా చేసినా..  తెలంగాణ ప్రతిష్ఠ దిగజార్చినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. హెచ్‌సీఏ ప్రైవేటు వ్యవహారం అని అనుకున్నా.. వేలాది మంది జనం వస్తారు గనక శాంతిభద్రతల సమస్య వస్తుంది. ముందే ప్రభుత్వానికి సమాచారం ఇస్తే పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, అగ్నిమాపక శాఖలు సమన్వయం చేసుకుంటాయి. ఇప్పటికే జారీ అయిన ప్రభుత్వ జీవో ప్రకారం ముందే మాకు సమాచారం ఇవ్వాలని అడిగాం.  ఉమ్మడి ఏపీలో కూడా సొంత వ్యవహారంలా నడుపుకొన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించారు. అలాగే, ఇప్పుడూ చేయాలనుకున్నారు. తెలంగాణలో అలా కుదరదు.. పారదర్శకంగా ఉండాలి. నిబంధనలు పాటించాలని స్పష్టంగా చెప్పాం. ఎన్ని టికెట్లు ఎన్ని అమ్మారు? ఇంకా ఎన్ని ఉన్నాయి? తదితర వివరాలు అడిగాం. ప్రింట్‌ అయిన టికెట్లన్నీ విక్రయించేలా చూస్తాం. భవిష్యత్తులో మ్యాచ్‌లు వస్తే ముందుగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని చెబుతాం. 

ఇంకా ఎన్ని టికెట్లు ఉన్నాయో మీకు ఏమైనా చెప్పారా?

చెప్పలేదు. అందుకే నిన్న సీరియస్‌ అయ్యాను. మా అధికారులతో మాట్లాడాను. మళ్లీ ఇప్పుడు కూడా పిలిపించి మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇలా జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం. 

హైదరాబాద్‌లో తరచూ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగకపోవడం వల్ల కూడా అభిమానుల్లో ఎక్కువగా ఈ మ్యాచ్‌కు పోటీ ఉంది అనే దానిపై ఏమంటారు?

కొవిడ్‌ సమయంలో చాలా వరకు జనం గుమిగూడొద్దనే ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగైంది. మళ్లీ అన్నీ మొదలవుతున్నాయి. హైదరాబాద్‌లో మళ్లీ మళ్లీ మ్యాచ్‌లు జరిగేలా చూస్తాం. అందుకు తగిన ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేస్తాం. ఇది ప్రభుత్వం చేసే ఈవెంట్‌ అయితే ముందే మేం ఏర్పాట్లు చేయగలం. ఇది అసోసియేషన్‌ గనక ప్రైవేటుగా చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందే సమాచారం ఇవ్వాలి. 

గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల విషయంలో హైదరాబాద్‌లో బీసీసీఐ ఎందుకు ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించడంలేదని ప్రశ్నించారు కదా? 

తెలంగాణకు ప్రతిదీ అన్యాయమే జరుగుతోంది. రాష్ట్ర ఏర్పాటుతోనే కేంద్రం ఏడు మండలాలు ఏపీలో కలిపేసింది. నిధుల్లోనూ కొరతే. తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారు. ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇచ్చింది లేదు. క్రికెట్‌లోనూ ఇలాగే ఉంది. ఇలాగే కొనసాగితే మేం ఊరుకోం.. బీసీసీఐకి లేఖ రాస్తాం. భవిష్యత్తుల్లో క్రీడా రంగంలోనూ తెలంగాణ నంబర్‌ వన్‌ అవుతుంది. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకొంటున్నారు. 

ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌ జరగబోతోంది.. టికెట్ల వ్యవహారంపై ఇప్పుడు సమీక్ష చేస్తున్నారు. హెచ్‌సీఏకు, క్రీడాభిమానులకు మీరేం చెబుతారు?

క్రీడాభిమానులు కొంత సంయమనం పాటించాలి. టికెట్లు దొరికితే స్టేడియంలో చూడండి. లేకపోతే ఇంట్లో టీవీల్లో చూడండి. అనవసరమైన ఆవేశాలకు పోయి జీవితాలను పాడుచేసుకోవద్దు. రాబోయే మ్యాచ్‌లకు ఎలా ఉండాలనే దానిపై మేం చర్యలు తీసుకొంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని