Maharashtra: ఇడ్లీలలో.. బ్లాక్‌ ఇడ్లీ రుచి వేరయా..!

ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. మల్లెపువ్వులా తెల్లగా.. దూదిలా.. సుతిమెత్తగా ఉండే ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు.

Published : 21 Dec 2021 01:52 IST

నాగ్‌పుర్‌: ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. మల్లెపువ్వులా తెల్లగా.. దూదిలా.. సుతిమెత్తగా ఉండే ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఉదయాన్నే అల్పాహారంగా లాగించేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో దోశెతో పాటు ఎక్కువ మంది ఇష్టపడే టిఫిన్‌లలో ఇడ్లీ ఒకటి. మనకు తెలిసినంతవరకు ఇడ్లీలు తెల్లగా ఉంటాయి. రాగి ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీలు అంటూ పలు వెరైటీల ఇడ్లీలు అప్పుడప్పుడూ మార్కెట్లో కనిపిస్తుంటాయి. కానీ నలుపు రంగులో ఉండే ఇడ్లీలను మీరెప్పుడైనా రుచి చూశారా? కనీసం విన్నారా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే నాగ్‌పుర్‌ వెళ్లాల్సిందే. 

మహారాష్ట్రలో నాగ్‌పుర్‌లోని సివిల్‌ లైన్‌ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న టిఫిన్‌ సెంటర్‌ ముందు ఉదయాన్నే జనం బారులు తీరి కనిపిస్తుంటారు. అయితే వారిలో నాగ్‌పుర్‌వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారూ ఉంటారు. ఆ టిఫిన్‌ సెంటర్‌ అంతలా ప్రజలను ఆకర్షించడానికి ప్రధాన కారణం అక్కడ వడ్డించే బ్లాక్‌ ఇడ్లీలే. అలాంటి విభిన్నమైన ఇడ్లీలను విక్రయించేది తెలుగువారు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుమార్‌ రెడ్డి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే నాగ్‌పూర్‌లో స్థిరపడింది. అక్కడి సివిల్‌ లైన్‌ ప్రాంతంలో టిఫిన్‌ సెంటర్‌ను ప్రారంభించిన కుమార్‌ రెడ్డి.. దక్షిణ భారత వంటకాలను చేయడంలో దిట్ట. ఇడ్లీ తయారీలో ఆయనది అందెవేసిన చేయి. కారంపొడి ఇడ్లీ, కార్న్‌ ఇడ్లీ, క్యారెట్‌ ఇడ్లీ, చీజ్‌ ఇడ్లీ, చాక్లెట్‌ ఇడ్లీ, పిజ్జా ఇడ్లీ, ఫ్రైడ్‌ ఇడ్లీ.. ఇలా దాదాపు 40 రకాల ఇడ్లీలను కుమార్‌ రెడ్డి వండి వడ్డిస్తున్నారు. అయితే ఇవన్నీ చాలా చోట్ల దొరికేవేనని.. ఇంకేదైనా కొత్తగా చేయాలని మిత్రులు సూచించారు. అప్పుడు వచ్చిందే.. బ్లాక్‌ ఇడ్లీ ఆలోచన. 

నల్లటి ఇడ్లీ తయారీలో కొబ్బరి చిప్పలు, నారింజ తొక్కలు, బీట్‌రూట్‌ గుజ్జు లాంటి సహజ పదార్థాలనే వినియోగిస్తున్నట్టు కుమార్‌ రెడ్డి చెప్పారు. అందుకే ఏ సమస్యలూ రావని ఆయన తెలిపారు. వాటి వల్ల ఇడ్లీ రుచి కూడా అదిరిపోతుందని పేర్కొన్నారు. అయితే ప్రారంభంలో బ్లాక్‌ ఇడ్లీలను తినడానికి ఎవరూ ఆసక్తి చూపలేదని ఆయన చెప్పారు. తర్వాత కొంతమందికి నమ్మకం కుదిరి.. ఒకసారి తినగానే ఇష్టపడటం మొదలుపెట్టినట్టు వివరించారు. బ్లాక్‌ ఇడ్లీతోపాటు మరిన్ని వెరైటీలను చేయాలని కస్టమర్లు కోరుతున్నారని ఆయన తెలిపారు. అన్ని రంగులతో కలిపి సప్తరంగీ పేరిట ఇడ్లీ తయారు చేయాలని పలువురు సూచిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ఆ ప్రయత్నం చేస్తానని తెలిపారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని