Health: మహిళల ఆరోగ్యానికి ఒత్తిడి పెను శాపం

పిల్లాడు అన్నం చదవడం లేదనో..అత్తామామ ఆరోగ్యం బాగోలేదనో..భర్తకు సకాలంలో అల్పాహారం అందించలేదనో..పని చేసే కార్యాలయంలో బాస్‌తో తిట్లు తింటుండమో ఏమోగానీ మహిళలు ఒత్తిడికి గురవుతున్నారు.

Updated : 11 Apr 2022 08:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పిల్లాడు అన్నం తినడం లేదనో..అత్తామామ ఆరోగ్యం బాగోలేదనో..భర్తకు సకాలంలో అల్పాహారం అందించలేదనో..పని చేసే కార్యాలయంలో బాస్‌తో తిట్లు తింటుండమో ఏమోగానీ మహిళలు ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా కుంగిపోయి ఆందోళన చెందుతున్నారు. పని భారం, ఒత్తిడితో చిన్న చిన్న తప్పులు చేసి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోంది. సుదీర్ఘకాలంగా ఈ పనులను చేస్తూ సతమతం కావడంతో మహిళలు తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నారు. మగవారితో పోల్చితే రెండింతలు మహిళలు ఒత్తిడికి గురవుతున్నారని ఇటీవల పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. 70 శాతం ఆరోగ్య సమస్యలు ఒత్తిడిమూలంగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించడానికి క్లినికల్‌ సైకియాట్రిస్ట్‌ కళ్యాణ్‌చక్రవర్తి కొన్ని సూచనలు చేశారు.

వీరికి అధికం: మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. కానీ మగవారికంటే మహిళలకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనికి హార్మొనల్‌ ప్రభావం, సున్నిత మనస్తత్వం, వివిధ రకాల బాధ్యతలుండటం,పెరిగిన వాతావరణంతో మహిళలు అధిక ఒత్తిడితో సతమతం అవుతారు. ఆడవారిలో ఈస్ట్రోజన్‌, పొజిస్ట్రాన్‌, బ్రెయిన్‌లో ఉండే కార్టికల్‌ స్ట్రక్చర్‌, న్యూరో కెమికల్‌,న్యూరో ఎండోక్రైన్‌ సిస్టం భిన్నంగా ఉంటాయి. అందుకే తొందరగా ఒత్తిడికి లోనవుతారు.

ప్రభావం ఎక్కువ: మహిళలకు వచ్చే ఒత్తిడి ప్రభావం జీవనంపై ఎక్కువగా చూపుతుంది. శరీరం మొత్తమ్మీద చూపిస్తుంది. కోపం, బాధ లాంటి నెగెటివ్‌ ఎమోషన్లు పెరుగుతాయి. 

* ఒత్తిడి అసిడిటీ నుంచి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె, కిడ్నీతో పాటు అనేక జబ్బులను మోసుకొస్తుంది. 

* మానసిక ఒత్తిడి అధికమైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తనలాగే అందరూ ఉండాలనే భావనలో మార్పు వస్తే తట్టుకోలేరు.

* అవమానం జరిగితే మగవాళ్లు తొందరగా వదిలేస్తారు.కానీ మహిళలు తొందరగా దాన్ని జీర్ణించుకోలేరు. విపరీతంగా ఆలోచన చేస్తారు.

* బాధ్యతలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో కూడా ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల చదువుతో పాటు భర్త ఆలస్యంగా ఇంటికి వచ్చినా తీవ్రంగా మధనపడుతారు. పరిష్కారం తెలుసుకునే దాకా నిద్రపోరు.

*  మహిళలకు తోడూ కావాలి. తన బాధను, తన అభిప్రాయాలను వినే వ్యక్తి కోసం చూస్తారు. కుటుంబసభ్యులు అందుబాటులో ఎవరూ లేకపోవడంతో మానసికంగా కుంగిపోతారు. 

ఇది పరిష్కారం 

మహిళలు ఒత్తిడికి గురయినపుడు దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాలి. పరిష్కార మార్గాన్ని చూపించాలి. కార్యాలయాల్లో బాస్‌లతోనూ, ఇంట్లో భర్త, అత్తామామలతో, పిల్లల చదువు విషయంలో చర్చించినట్లయితే ఒత్తిడి తగ్గించుకోవచ్చు. శారీరక వ్యాయామం, విశ్రాంతి, పుస్తకాలు చదువుకోవడానికి సమయాన్ని తీసుకోవాలి. మానసిక ప్రశాంతతకు మెడిటేషన్‌ చేయాలి. ఇంటా బయట పనులను వాయిదా వేసుకోకుండా ప్రణాళికతో పూర్తి చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని