ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలి: సుప్రీం

తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగుల పంపకం.. ఆస్తులు, అప్పులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం

Published : 22 Mar 2021 15:24 IST

తెలుగు అకాడమీ విభజనపై విచారణ

దిల్లీ: తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగుల పంపకం.. ఆస్తులు, అప్పులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేసింది. అకాడమీ విభజన అంశం న్యాయపరిధిలోకి రాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని నెలరోజుల్లో ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. 

రెండు రాష్ట్రాల్లోని తెలుగు అకాడమీల్లో పనిచేస్తున్న సిబ్బందిని, వాటికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, నిధులను మూడు నెలల్లో విభజించుకోవాలని తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశించింది. తమకు 2019 డిసెంబరు నుంచి వేతనాలు అందటం లేదని, ఉమ్మడి అకాడమీని విభజిస్తేనే న్యాయం జరుగుతుందని కోరుతూ ఏపీ పరిధిలోని తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న రోజువారీ, ఒప్పంద సిబ్బంది తెలంగాణ హైకోర్టులో గత నవంబరులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జనవరిలో జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. విభజనకు రెండు నెలల్లో మార్గదర్శకాలు రూపొందించుకొని, ఆ తర్వాత నెలలోగా కేటాయింపులు పూర్తి చేయాలని తీర్పునిచ్చింది. సిబ్బందికి వేతనాలు, పిటిషనర్లకు అసౌకర్యం కలిగినందున 17 మందికి రూ.3 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని