టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Apr 2023 09:36 IST

1. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహనిర్బంధం

వైకాపా నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నగరంలోని మాగుంట లేఔట్‌లోని నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి వద్దే కోటంరెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేస్తూ ౮ గంటలపాటు జలదీక్షకు కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఆ నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవడంతో పోలీసులు గృహనిర్బంధం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. నేటి నుంచి జేఈఈ మెయిన్‌

దేశవ్యాప్తంగా గురువారం నుంచి జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సుమారు 9.40 లక్షల మంది హాజరుకానున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తారు. ఈనెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. దేశంలో మొత్తం 330 నగరాలు / పట్టణాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్షలు జరగనున్నాయి. గత జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా వారిలో 8.24 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య 80 వేలు పెరిగింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కొత్త వెలుగులతో లాభాల వర్షం!

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండును ఆదాయంగా మార్చుకునేందుకు సింగరేణి భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సమీప భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే వ్యాపారంగా విద్యుత్‌రంగం మారడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకూ ఉన్న విద్యుత్‌ కేంద్రాల సంఖ్యను, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచబోతోంది. ప్రస్తుతం కేవలం 1,500 మెగావాట్లున్న సంస్థ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 3,350 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)కు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీకి మాత్రమే తెలంగాణలో విద్యుదుత్పత్తి ప్లాంట్లు అధికంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. నా మృతదేహాన్ని ఇండియాకు తీసుకెళ్లండి

 ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలుసుకున్న ఆ యువకుడు కుంగిపోలేదు. తాను చనిపోతానని తెలిసినా మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు. అమ్మా..నాన్నా...నేను చనిపోతున్నా. మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఓదార్చాడు. తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇంటికి తరలించేందుకు తనే ఏర్పాట్లు చేసుకున్నాడు. నమ్మలేకున్నా..కళ్లు చెమ్మగిల్లే వాస్తవమిది. చివరకు అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా.. ఖమ్మంలో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ‘జై జనసేన’ అన్నందుకు విద్యార్థులపై పోలీసు వీరంగం

మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ‘జై జనసేన’ అని నినదించినందుకు విద్యార్థులపై పోలీసు ప్రతాపం చూపించారు. విద్యార్థులను నోటికొచ్చినట్లు తిడుతూ అందరూ చూస్తుండగా కళాశాల నుంచి బయటకు చొక్కా పట్టుకుని లాక్కొచ్చారు. ప్రిన్సిపల్‌, అధ్యాపకులు మొర పెట్టుకుంటున్నా వినేదే లేదంటూ, మంత్రిని మెప్పించడమే ధ్యేయంగా వీరంగం సృష్టించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాలలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విమర్శలూ నేరమేనా?

సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ వారిపైన చిన్న రాజకీయ విమర్శ చేసినా సహించేది లేదన్నట్లుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. విచారణ పేరిట ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకుల్ని వేధిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల భావప్రకటన స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రంపై ప్రభుత్వం, పోలీసులు ఏమైనా నిషేధం విధించారా? సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారే లక్ష్యంగా కొన్నాళ్ల కిందట వరకూ సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసేవారు. అరెస్టు చేసి, విచారణ పేరిట వేధించేవారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. అటకెక్కిన రైతుబంధు

రైతులు పండించే పంటలపై వసూలుచేసే మార్కెట్‌ రుసుమునూ.. వడ్డీలేని రుణం రూపంలో వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. మార్కెట్‌ కమిటీల ద్వారా అమలుచేసే రైతుబంధుకు చెల్లుచీటీ ఇచ్చేసింది. తమ పార్టీ నేతల రాజకీయ ఉపాధి కోసం మార్కెట్‌ కమిటీలను 191 నుంచి 218కి పెంచిన ప్రభుత్వం.. నాలుగేళ్ల నుంచి వాటిలో ఒక్క చోటా రైతుకు రుణం ఇవ్వలేదు. మూడు దశాబ్దాల నుంచి నడుస్తున్న కీలక పథకాన్ని నిలిపేసి, అన్నదాతలను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టింది. మార్కెట్‌ కమిటీల్లో ఎమ్మెల్యేలను గౌరవ అధ్యక్షులుగా చేయడం, రైతులు కాకున్నా అధికారపార్టీ వాళ్లయితే పాలకవర్గంలో వేయచ్చన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కనీసం గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వకూ అవకాశం లేకుండా చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. జీవనకాల గరిష్ఠ స్థాయికి పసిడి

పసిడి జీవనకాల గరిష్ఠమైన రూ.61,000 స్థాయిని అందుకుంది. ఇక్కడి బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,025 పెరిగి రూ.61,080 తాకింది. సానుకూల అంతర్జాతీయ ధోరణులు ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. అంతక్రితం రోజు ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.60,055 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీ రూ.1,810 దూసుకెళ్లి రూ.73,950 తాకింది. విదేశీ మార్కెట్‌ చూస్తే.. న్యూయార్క్‌లో ఔన్సు పసిడి ధర 2,027 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి సైతం 24.04 డాలర్లకు పెరిగింది.
 మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అణు యుద్ధం రావొచ్చు

ప్రపంచంలోని కొన్ని ధూర్త దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా జట్టుకడుతున్నాయని, ప్రతి ఒక్కరూ అణు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని, బైడెన్‌ అసమర్థతవల్లే ఇదంతా జరుగుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు. తన హయాంలో అణ్వస్త్రాలపై మాట్లాడేందుకే చాలా దేశాలు భయపడేవని, ఇప్పుడు అందరూ హెచ్చరిస్తున్నారని తెలిపారు. ‘మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో లేదు. కరెన్సీ విలువ పడిపోతోంది. చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా జతకట్టాయి. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా జట్టుకట్టి విధ్వంసకర ప్రయత్నాలు చేస్తున్నాయి. నేను అధ్యక్షుడిగా ఉంటే ఇవన్నీ జరిగేవి కావు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చేది కాదు’ అని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. జీతమేది జగనన్నా!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల కోసం ఈ నెల కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు కేవలం 36 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు పడ్డాయి. పెన్షనర్లకు బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పడలేదు. వారం రోజుల కిత్రం కలెక్టరేట్‌లో జరిగిన పెన్షనర్ల అదాలత్‌లో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఐదో తేదీ వరకు కూడా చెల్లించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 16 వేల మంది వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని