Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహనిర్బంధం

వైకాపా నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Updated : 06 Apr 2023 10:09 IST

నెల్లూరు: వైకాపా నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నగరంలోని మాగుంట లేఔట్‌లోని నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి వద్దే కోటంరెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. 

పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేస్తూ 8 గంటలపాటు జలదీక్షకు కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఆ నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవడంతో పోలీసులు గృహనిర్బంధం చేశారు.  దీంతో పెద్ద ఎత్తున కోటంరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. 

పోలీసులు ఎంతసేపు కాపలా ఉంటారు?: కోటంరెడ్డి

జలదీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చే వరకు ఇంటి బయటే కూర్చొంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తేల్చిచెప్పారు. తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తున్నానని చెప్పారు. పోలీసులు గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వంతెన నిర్మాణం కోసం పొట్టేపాలెం కలుజు వద్ద శాంతియుతంగా నిరసన చేస్తానని చెప్పానని.. 10 రోజులుగా పోలీసులను అనుమతి కోరుతున్నట్లు తెలిపారు. తన నిరసనను అడ్డుకోవడం సరికాదని.. ఎంత సేపు పోలీసులు కాపలా ఉంటారని కోటంరెడ్డి ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని