అటకెక్కిన రైతుబంధు

రైతులు పండించే పంటలపై వసూలుచేసే మార్కెట్‌ రుసుమునూ.. వడ్డీలేని రుణం రూపంలో వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు.

Published : 06 Apr 2023 05:39 IST

నాలుగేళ్లుగా వడ్డీలేని రుణాలకు ప్రభుత్వం చెల్లుచీటీ
ఏడాదికి రూ.500 కోట్లకుపైగా రుసుముల వసూలు
వడ్డీలేని రుణాలకు పైసా కూడా విదల్చని వైనం

ఈనాడు, అమరావతి: రైతులు పండించే పంటలపై వసూలుచేసే మార్కెట్‌ రుసుమునూ.. వడ్డీలేని రుణం రూపంలో వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. మార్కెట్‌ కమిటీల ద్వారా అమలుచేసే రైతుబంధుకు చెల్లుచీటీ ఇచ్చేసింది. తమ పార్టీ నేతల రాజకీయ ఉపాధి కోసం మార్కెట్‌ కమిటీలను 191 నుంచి 218కి పెంచిన ప్రభుత్వం.. నాలుగేళ్ల నుంచి వాటిలో ఒక్క చోటా రైతుకు రుణం ఇవ్వలేదు. మూడు దశాబ్దాల నుంచి నడుస్తున్న కీలక పథకాన్ని నిలిపేసి, అన్నదాతలను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టింది. మార్కెట్‌ కమిటీల్లో ఎమ్మెల్యేలను గౌరవ అధ్యక్షులుగా చేయడం, రైతులు కాకున్నా అధికారపార్టీ వాళ్లయితే పాలకవర్గంలో వేయచ్చన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కనీసం గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వకూ అవకాశం లేకుండా చేసింది.

మూడు దశాబ్దాలకు పైగా..

ఉమ్మడి రాష్ట్రం నుంచి రైతుబంధు పథకం అమలవుతోంది. 1982 నుంచి పంట ఉత్పత్తుల తాకట్టుపై రుణం తీసుకునే పథకం ఉన్నా.. దానికి 1995లో రైతుబంధుగా పేరు మార్చారు. ఈ పథకం ద్వారా మార్కెట్‌ కమిటీ గోదాముల్లో రైతులు నిల్వచేసిన పంట ఉత్పత్తులపై 75% విలువ మేర గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు. దీనిపై 180 రోజుల వరకూ వడ్డీ ఉండదు. 6 నెలల నుంచి 9 నెలల వరకు 12% చొప్పున వడ్డీ వసూలుచేస్తారు. 

విత్తనం వేసే సమయంలో ధరలు అధికంగా ఉన్నా.. పంట చేతికొచ్చే సమయానికి పడిపోతుంటాయి. అప్పుడు పంటను తెగనమ్ముకోకుండా.. మార్కెట్‌ కమిటీ పరిధిలోని గోదాముల్లో నిల్వ చేసుకుని దానిపై రుణం తీసుకునే వెసులుబాటు ఈ పథకం ద్వారా లభిస్తుంది. ధర బాగున్నప్పుడు అమ్ముకుని రుణం తీర్చేయొచ్చు. గతంలో రైతులు తమకు దగ్గరలోని మార్కెట్‌ కమిటీ గోదాముల్లో వరి, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనెగింజల పంటలను నిల్వ చేసి రుణాలు తీసుకునేవారు.

2019 వరకు అమలైనా..

ప్రారంభంలో రైతులకు రుణాలు బాగానే ఇచ్చేవారు. తర్వాత మార్కెట్‌ కమిటీ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లిస్తూ.. కేటాయింపులు తగ్గించారు. 2017-18లో 3,238 మంది రైతులకు రూ.54.08 కోట్లు, 2018-19లో రూ.40.51 కోట్ల రుణం ఇచ్చారు. తర్వాత అసలు అమలే నిలిపేశారు.

రైతుల నుంచి వసూలు చేసే సొమ్ము ఇవ్వడానికీ ఇబ్బందా?

పంట ఉత్పత్తుల అమ్మకాలపై మార్కెట్‌ కమిటీలు 1% రుసుము వసూలుచేస్తాయి. ఉద్యోగుల జీతాలు, రైతుబంధుకు అవసరమయ్యే నిధుల్ని వాటినుంచే కేటాయించేవారు. 2019 నుంచి వీటిని నిలిపేశారు. సంస్కరణల పేరుతో రైతులు పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకునేందుకూ చోటివ్వడం లేదు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను రాజకీయ పునరావాసాలుగా మార్చిన ప్రభుత్వం.. అన్నదాతలకు వాటిని దూరం చేసిందని రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.


రైతులకు మార్కెట్‌ కమిటీ నిధుల నుంచి వడ్డీలేని రుణం ఇవ్వడానికి.. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి మనసు రావట్లేదు. పంట ఉత్పత్తులపై మార్కెట్‌ రుసుము రూపంలో ఏడాదికి రూ.500 కోట్లకు పైగా ఖజానాలో జమ చేసుకుంటున్నా... అందులోనుంచి అప్పుగానే ఏడాదికి రూ.100 కోట్లు ఇచ్చేందుకూ ససేమిరా అంటోంది. ఏడాదికి మూడు విడతలుగా ఇచ్చే రూ.7,500 రైతు భరోసాతో సరిపెట్టుకోవాలంటూ ‘రైతుబంధు’ పథకాన్ని అటకెక్కించింది.  వ్యాపారుల వద్ద పెట్టుబడి కోసం రైతులు అధిక వడ్డీకి అప్పు తెచ్చుకుని సాగు చేస్తున్నా.. తమకేమీ పట్టనట్లే చోద్యం చూస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు