logo

జీతమేది జగనన్నా!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల కోసం ఈ నెల కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు కేవలం 36 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు పడ్డాయి.

Updated : 06 Apr 2023 05:34 IST

ఉద్యోగుల నిరీక్షణ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల కోసం ఈ నెల కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు కేవలం 36 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు పడ్డాయి. పెన్షనర్లకు బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పడలేదు. వారం రోజుల కిత్రం కలెక్టరేట్‌లో జరిగిన పెన్షనర్ల అదాలత్‌లో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఐదో తేదీ వరకు కూడా చెల్లించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 16 వేల మంది వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. ట్రెజరరీ, అటవీశాఖ, సచివాలయ ఉద్యోగులు, కొందరు ఉపాధ్యాయుల అకౌంట్లకు మాత్రమే జమయ్యాయి. మిగిలిన ఉద్యోగులందరూ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు వస్తాయి..నెలవారీ ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక మదనపడుతున్నారు. శుక్రవారం నుంచి వరసగా మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో మరో వారం వరకు లేనట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెల ఐదో తేదీ లోపు దాదాపు 40 శాతం మందికి పెన్షన్లు పడగా... ఈ నెల ఇప్పటివరకు ఒక్కరికి కూడా పడకపోవడం గమనార్హం.


ఇబ్బంది పడుతున్నాం
 -ఎస్‌.గోపాల్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు, తిరుపతి

ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల ఒకటో తేదీన జీతం పొందడం హక్కుగా భావిస్తుంటారు. అయితే కొన్ని నెలలుగా సరైన సమయంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మరో వారం రోజుల వరకు వస్తాయన్న నమ్మకం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు