కొత్త వెలుగులతో లాభాల వర్షం!

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండును ఆదాయంగా మార్చుకునేందుకు సింగరేణి భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సమీప భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే వ్యాపారంగా విద్యుత్‌రంగం మారడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Published : 06 Apr 2023 05:28 IST

1,850 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం
సింగరేణి భారీ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండును ఆదాయంగా మార్చుకునేందుకు సింగరేణి భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సమీప భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే వ్యాపారంగా విద్యుత్‌రంగం మారడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకూ ఉన్న విద్యుత్‌ కేంద్రాల సంఖ్యను, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచబోతోంది. ప్రస్తుతం కేవలం 1,500 మెగావాట్లున్న సంస్థ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 3,350 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)కు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీకి మాత్రమే తెలంగాణలో విద్యుదుత్పత్తి ప్లాంట్లు అధికంగా ఉన్నాయి. ఇక వాటితో పోటీపడుతూ సింగరేణి కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టబోతోంది. నెలరోజులలోగా 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు, 250 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక తయారుచేయాలని బుధవారం నిర్ణయించింది. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద సుమారు 2 వేల ఎకరాలలో సింగరేణికి 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉంది. ఇదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణి పాలకమండలి ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ఇది పూర్తయితే థర్మల్‌ విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 2 వేల మెగావాట్లకు చేరుకుంటుంది. దీనికి అదనంగా అదే ప్రాంతంలో మరో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సానుకూల అంశాలున్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై నెలలోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారుచేయాలని సంస్థ నిర్ణయించింది. ఇది పూర్తయితే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,800 మెగావాట్లకు పెరుగుతుంది.

సౌరవిద్యుత్‌పై దృష్టి...

ప్రస్తుతం 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో 224 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుదుత్పత్తి కూడా ప్రారంభమైంది. మరో రెండు నెలల్లో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తికానుంది. వీటిని సింగరేణి ఖాళీ స్థలాల్లోనే ఏర్పాటు చేయడంతో భూసేకరణ సమస్య రాలేదు. వీటిద్వారా సంస్థ అవసరాలకు ఏటా వినియోగించే 700 మిలియన్‌ యూనిట్ల కరెంటు బిల్లు ఖర్చులు తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి, మందమర్రి, మణుగూరు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మరో 250 మెగావాట్ల సౌరవిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను నెలరోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సంస్థ  సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఇవి పూర్తయితే సౌరవిద్యుత్‌ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు చేరుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని