Donald Trump: అణు యుద్ధం రావొచ్చు

ప్రపంచంలోని కొన్ని ధూర్త దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా జట్టుకడుతున్నాయని, ప్రతి ఒక్కరూ అణు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని, బైడెన్‌ అసమర్థతవల్లే ఇదంతా జరుగుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్వజమెత్తారు.

Updated : 06 Apr 2023 09:54 IST

ప్రతి ఒక్కరూ అణు దాడి చేస్తామని బెదిరిస్తున్నారు
నేనుంటే ఉక్రెయిన్‌పై దాడి జరిగేదే కాదు
బైడెన్‌ అసమర్థతవల్లే ఇదంతా..
అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది
అరెస్టయి, విడుదలైన అనంతరం ట్రంప్‌ వ్యాఖ్యలు
34 అభియోగాలను మోపిన కోర్టు
తాను నేరం చేయలేదని ట్రంప్‌ వాదన

వాషింగ్టన్‌: ప్రపంచంలోని కొన్ని ధూర్త దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా జట్టుకడుతున్నాయని, ప్రతి ఒక్కరూ అణు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని, బైడెన్‌ అసమర్థతవల్లే ఇదంతా జరుగుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు. తన హయాంలో అణ్వస్త్రాలపై మాట్లాడేందుకే చాలా దేశాలు భయపడేవని, ఇప్పుడు అందరూ హెచ్చరిస్తున్నారని తెలిపారు. ‘మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో లేదు. కరెన్సీ విలువ పడిపోతోంది. చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా జతకట్టాయి. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా జట్టుకట్టి విధ్వంసకర ప్రయత్నాలు చేస్తున్నాయి. నేను అధ్యక్షుడిగా ఉంటే ఇవన్నీ జరిగేవి కావు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చేది కాదు’ అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న డెమోక్రాట్లు అమెరికా ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని, విఫల దేశంగా మార్చేస్తున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుని ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఈ లెఫ్టిస్ట్‌ భావజాలం ఉన్న ఉన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శృంగార తారతో అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు రహస్య ఆర్థిక ఒప్పందం చేసుకున్న కేసులో ట్రంప్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి న్యూయార్క్‌లోని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనపై నమోదైన 34 నేరాభియోగాలను చదివి వినిపించారు. వాటిని ట్రంప్‌ తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన న్యూయార్క్‌ నుంచి ఫ్లోరిడా చేరుకున్నారు. అక్కడి మారెలాగో రిసార్టులో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘నేను చేసిన తప్పేంటంటే.. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిని ధైర్యంగా అడ్డుకోవడమే. మన దేశం నరకంలోకి వెళ్తోంది. నేను శ్వేతసౌధం నుంచి బయటకు రావడం దేశ చరిత్రలోనే అత్యంత ఇబ్బందికర పరిణామం. మళ్లీ అమెరికాను గొప్ప దేశంగా మనం తీర్చిదిద్దుదాం. నామీద ఏ కేసూ లేకపోయినా కోర్టును మన్‌హటన్‌ అటార్నీ ప్రభావితం చేశారు. గ్రాండ్‌ జ్యూరీ పత్రాలను కావాలనే అటార్నీ లీక్‌ చేశారు. నా కేసులో నకిలీ దర్యాప్తు జరుగుతోంది. అయినా మీకందరికీ హామీ ఇస్తున్నా. దేశాన్ని రక్షించే విషయంలో నన్ను వారు దెబ్బతీయలేరు. ఆపలేరు. న్యాయమూర్తి జువాన్‌ మెర్చన్‌ నాకు వ్యతిరేకి. ఆయన కుమార్తె.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కోసం పని చేస్తున్నారు. బైడెన్‌-హ్యారిస్‌ దగ్గర డబ్బులు తీసుకుని నామీద అభియోగాలను న్యాయమూర్తి మోపారు’ అని ట్రంప్‌ ధ్వజమెత్తారు.

తదుపరి హాజరు డిసెంబరులో..

నేరాభియోగాలు నమోదైన కేసులో మళ్లీ డిసెంబరు 4వ తేదీన ట్రంప్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రాసిక్యూటర్లు దర్యాప్తులో కనుగొన్న అంశాలను 65 రోజుల్లో కోర్టుకు సమర్పిస్తారు. ఆగస్టు 8వ తేదీలోగా ట్రంప్‌ న్యాయవాదులు డిస్మిస్‌ పిటిషన్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 19వ తేదీలోగా ప్రాసిక్యూటర్లు వాటిపై సమాధానమివ్వాల్సి ఉంటుంది. తదుపరి ట్రంప్‌ విచారణకు హాజరయ్యే డిసెంబరు 4న వాటిపై న్యాయమూర్తి మెర్చన్‌ నిర్ణయం తీసుకుంటారు.

‘క్షమాభిక్ష వర్తించదు’

ట్రంప్‌ కేసు 2024 ఎన్నికలయ్యేంత వరకూ తేలే అవకాశం లేదని ప్రముఖ భారతీయ అమెరికన్‌ న్యాయవాది రవి బాత్రా అభిప్రాయపడ్డారు. ‘అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తికి లభించే క్షమాభిక్ష’ కూడా ఈ కేసులో వర్తించదని స్పష్టం చేశారు. రిపబ్లికన్‌ ప్రైమరీల్లో ట్రంప్‌ పాల్గొనేందుకు వీలుగా కేసును త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని, డిసెంబరు కంటే ముందే పూర్తయ్యేలా చర్యలు చేపడతామని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్న నేపథ్యంలో బాత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 76ఏళ్ల ట్రంప్‌ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రిపబ్లికన్‌ ప్రైమరీలు ప్రారంభమవుతాయి. ‘ఈ కేసులో రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం విచారణ జరగడం అసాధారణమేమీ కాదు. 2024 వేసవికల్లా ట్రయల్‌కు రావడం అసంభవం. అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబరు నాటికీ రాకపోవచ్చు’ అని బాత్రా వివరించారు.


ఆరుసార్లే మాట్లాడిన ట్రంప్‌

న్యూయార్క్‌: కోర్టు హాలులో ట్రంప్‌ కేవలం ఆరుసార్లే మాట్లాడారు. తాను దోషిని కాదని చెప్పడంతోపాటు మరో ఐదుసార్లే స్పందించారు. సుమారు గంటపాటు కోర్టు విచారణ సాగింది. న్యాయమూర్తి అడిగిన వాటికి అవును.. కాదు అని మాత్రమే సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు