Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Mar 2024 13:23 IST

1. దేవాంశ్‌ పుట్టినరోజు.. శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాంశ్‌ జన్మదినం సందర్భంగా లోకేశ్‌- బ్రాహ్మణి దంపతులు, నారా భువనేశ్వరి స్వామివారి దర్శనానికి వచ్చారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. పూర్తి కథనం

2. ఇంజినీర్లతో రెండో రోజూ ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ భేటీ

ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ రెండో రోజు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఇంజినీర్లతో సమావేశమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీ ఇంజినీర్లతో విడివిడిగా చర్చలు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ డిజైన్ల వివరాలపై ఆరా తీస్తోంది.పూర్తి కథనం

3. ప్రణీత్‌రావుకు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పూర్తి కథనం

4. ‘ఇప్పుడు చట్టాన్ని ఆపితే గందరగోళమే’.. ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ

లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల  (election commissioners) నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది.పూర్తి కథనం

5. భారత్‌కు ఎస్‌-400 డెలివరీలు ఇప్పట్లో లేనట్లే..!

అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400లను భారత్‌కు అందజేయడంలో మరింత జాప్యం చోటు చేసుకొంటుందని రష్యా (Russia) చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2024 తొలి అర్ధభాగంలోనే మొత్తం ఐదు వ్యవస్థలనూ అందజేయాల్సి ఉంది. ఉక్రెయిన్‌తో సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధమే దీనికి కారణమని తెలుస్తోంది.పూర్తి కథనం

6. ఎన్నికల తర్వాత మా దేశాలకు రండి’.. మోదీని ఆహ్వానించిన పుతిన్‌, జెలెన్‌స్కీ

రష్యా-ఉక్రెయిన్‌ (Russia - Ukraine) వివాదం వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్నాలకు భారత్‌ పూర్తి మద్దతిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పునరుద్ఘాటించారు. ఆ దేశాల అధినేతలు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin), జెలెన్‌స్కీ (Zelenskyy)తో  ఫోన్‌లో మాట్లాడారు.పూర్తి కథనం

7. అరుణాచల్‌ భారత్‌దే.. చైనాకు తేల్చిచెప్పిన అగ్రరాజ్యం

భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌పై (Arunachal Pradesh) చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ.. భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ బుధవారం వెల్లడించారు.పూర్తి కథనం

8. మెదడులో చిప్‌తో వీడియో గేమ్‌ ఆడిన పక్షవాత బాధితుడు

మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలను చేపట్టిన న్యూరాలింక్‌ (Neuralink) నుంచి బుధవారం కీలక అప్‌డేట్‌ వచ్చింది. చిప్‌ను అమర్చిన వ్యక్తి నోలాండ్‌ అర్బాగ్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆయనతో వీడియో గేమ్‌ సివిలైజేషన్‌ VI, చెస్‌ ఆడించింది.పూర్తి కథనం

9. మొటిమల క్రీం వాడే ముందు.. ఈ జాగ్రత్త తప్పనిసరి!

టీనేజ్‌, యువతలో సర్వసాధారణంగా మొటిమల సమస్యను చూస్తూనే ఉంటాము. వాటిని ఎదుర్కోవడానికి రకరకాల క్రీమ్‌లు వినియోగిస్తుంటారు. వీటిల్లో ముఖ్యంగా బెంజయిల్‌ పెరాక్సైడ్‌ మిశ్రమాలను వాడుతుంటారు. వీటి వినియోగంలో చిన్న జాగ్రత్తలు తీసుకొంటే క్యాన్సర్‌ ముప్పును తప్పించుకోవచ్చని ది అమెరికన్‌ యాక్నే అండ్‌  రొసేసియా సొసైటీ (ఏఏఆర్‌ఎస్‌) పేర్కొంది.పూర్తి కథనం

10. రోహిత్ - హార్దిక్‌ కెప్టెన్సీ మార్పు.. ఆ విషయం కాలమే చెబుతుంది: హర్భజన్‌

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తొలిసారి రోహిత్‌ శర్మతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. జట్టులోని సభ్యులంతా కలిసికట్టుగా ఉన్నారని తెలియజేసినట్లయింది. అయితే, టోర్నీ జరిగే కొద్దీ రోహిత్ (Rohit Sharma) - హార్దిక్ ఎలా సెట్‌ అవుతారనేది ఆసక్తికరంగానే ఉంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని