Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Jul 2023 13:26 IST

1. రాజకీయ ఒత్తిళ్ల తోనే సీఐ బలవన్మరణం: జేసీ ప్రభాకర్ రెడ్డి

గత ఐదు నెలలుగా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తేవడంతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakarreddy) ఆరోపించారు. ఏ ప్రాంతంలోనూ లేని విధంగా తాడిపత్రిలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు.  రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు సీఐ బలవన్మరణంపై స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. రాజకీయ ఒత్తిడి కారణంగా సీఐ చనిపోయినట్లు నిరూపిస్తే.. తాను ఏ చర్యకైనా సిద్ధమని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అజిత్‌ రాకతో శిందే స్థానం గల్లంతే: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సామ్నా

మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో ఆదివారం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అజిత్ పవార్‌(Ajit Pawar) తన బాబాయి శరద్‌ పవార్‌ పార్టీ ఎన్‌సీపీని నిట్టనిలువునా చీల్చి.. తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరారు. ఆ వెంటనే మహా సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై శివసేన(UBT)కు చెందిన సామ్నా తన సంపాదకీయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పాక్‌లో జాక్‌మా అనూహ్య పర్యటన..కారణమేమిటో..?

చైనా పాలక వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల (Alibaba Group) వ్యవస్థాపకుడు జాక్‌ మా(Jack Ma) పలు దేశాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన పాకిస్థాన్‌(Pakistan)లో ప్రత్యక్షమయ్యారు. ఈ మేరకు పాక్‌ స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే పర్యటన వివరాలు గోప్యంగా ఉండటంతో.. అనేక ఊహాగానాలు వస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్‌ కలకలం..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసం వద్ద ఓ డ్రోన్‌ (Drone) కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఓ అనుమానాస్పద డ్రోన్‌ ప్రధాని నివాసంపై సంచరించినట్లు ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) నుంచి సమాచారం అందిందని దిల్లీ పోలీసులు (Delhi Police) వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తాడిపత్రి సీఐ ఆత్మహత్య.. ఇంట్లోనే ఉరివేసుకుని..

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (52) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత 9 నెలలుగా ఆనందరావు తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సీపీఐ కాలనీలోని అద్దె ఇంట్లో ఆయన కుటుంబం నివాసముంటోంది. గత కొన్ని రోజులుగా భార్య అనురాధతో సీఐకు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బండి సంజయ్‌కు దిల్లీ నుంచి పిలుపొస్తుందా?

తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడి మార్పు జరగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశానికి లైఫ్‌సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌: కేటీఆర్‌

సెమీ కండక్టర్ల రంగంలో హైదరాబాద్‌ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ కోకాపేటలోని వన్‌ గోల్డెన్‌మైల్‌లో మైక్రోచిప్‌ టెక్నాలజీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌ ఫెసిలిటీని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పెళ్లిపై ఆసక్తి చూపని చైనా యువత.. కారణాలివే!

గృహ హింస (Domestic violence)పై చైనా యువత (China youth) ఆందోళన చెందుతోంది. ఈ మధ్య కాలంలో  దేశంలో గృహిణులపై జరుగుతున్న హత్యలు, భౌతిక దాడుల వల్ల వివాహ బంధంపై అనుమానం వ్యక్తం చేస్తోంది అక్కడి యువత. దీంతో పెళ్లి (Marriage) చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సర్పంచుల ‘చలో తాడేపల్లి’లో ఉద్రిక్తత.. పలువురి అరెస్టు

ఏపీలో సర్పంచులు తలపెట్టిన పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి సర్పంచుల ఆందోళనకు దిగారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది సర్పంచులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వారిపై అనర్హత వేటు వేయండి.. అర్ధరాత్రి వేళ స్పీకర్‌ వద్దకు!

మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఎన్సీపీ (NCP) నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికారపక్షంలో చేరారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే, అజిత్‌ వర్గానికి పార్టీ మద్దతు లేదని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని కోరుతూ.. అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ (Rahul Narwekar)ను ఎన్సీపీ అభ్యర్థించింది. నర్వేకర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని