Jack Ma: పాక్‌లో జాక్‌మా అనూహ్య పర్యటన..కారణమేమిటో..?

చైనా మిత్రదేశం పాకిస్థాన్‌(Pakistan)లో అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు జాక్‌మా(Jack Ma) అనూహ్య పర్యటన చేశారు. ఇది వ్యాపార వర్గాలను ఆశ్చర్యపర్చింది. అయితే పర్యటన వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. 

Updated : 03 Jul 2023 13:26 IST

ఇస్లామాబాద్‌: చైనా పాలక వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల (Alibaba Group) వ్యవస్థాపకుడు జాక్‌ మా(Jack Ma) పలు దేశాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన పాకిస్థాన్‌(Pakistan)లో ప్రత్యక్షమయ్యారు. ఈ మేరకు పాక్‌ స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే పర్యటన వివరాలు గోప్యంగా ఉండటంతో.. అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

బోర్డ్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌( BOI) మాజీ ఛైర్మన్ మహమ్మద్‌ అజ్ఫర్ అహ్సాన్‌ ఈ పర్యటనను ధ్రువీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. జూన్‌29న జాక్‌మా లాహోర్‌ వచ్చారని, 23 గంటల పాటు అక్కడ ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ అధికారులు, మీడియాతో ఎటువంటి సంభాషణ జరపలేదు. ఒక ప్రైవేటు ప్రాంతంలో బస చేసిన ఆయన.. జూన్‌ 30న తిరిగి వెళ్లిపోయారు. ఆ పర్యటన వేళ.. జాక్‌ మా వెంట ఏడుగురు వ్యాపారవేత్తలు ఉన్నట్లు సమాచారం. ఆయన నేపాల్ నుంచి పాకిస్థాన్‌ చేరుకున్నారని సమాచారం.

ఈ పర్యటనతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. వారు పాక్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించినట్లు తెలుస్తోంది. అలాగే ట్రేడ్‌ సెంటర్‌లో సందర్శన, ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. అయితే ఏమైనా ఒప్పందాలు జరిగాయా..? అనే విషయం మాత్రం బయటకు రాలేదు.   ఈ ఆకస్మిక రాక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ..  రానున్న రోజుల్లో పాకిస్థాన్‌కు ఇది సానుకూల ఫలితాలను ఇస్తుందని అహ్సాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, దీని గురించి చైనా దౌత్యకార్యాలయానికి కూడా సమాచారం లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ ప్రభుత్వం జాక్‌మాతో సమావేశాలు జరిపి, ఆయనకున్న అనుభవాన్ని దేశ ప్రగతి కోసం ఉపయోగించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపర కుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. తర్వాత ప్రభుత్వం యాంట్‌ గ్రూప్‌పై చర్యలు చేపట్టింది. కొన్ని నెలలపాటు బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించలేదు. దీంతో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్‌మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు అరుదు. జపాన్‌, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉన్నట్లు ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత మార్చిలో జాక్‌మా చైనాకు తిరిగి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని