Maharashtra: అజిత్‌ రాకతో శిందే స్థానం గల్లంతే: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సామ్నా

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు అజిత్‌(Ajit Pawar) ఇచ్చిన షాకే అందుకు కారణం. దీనిపై సామ్నా స్పందించింది.

Updated : 03 Jul 2023 13:27 IST

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో ఆదివారం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అజిత్ పవార్‌(Ajit Pawar) తన బాబాయి శరద్‌ పవార్‌ పార్టీ ఎన్‌సీపీని నిట్టనిలువునా చీల్చి.. తన మద్దతుదారులతో కలిసి భాజపా ప్రభుత్వంలో చేరారు. ఆ వెంటనే మహా సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై శివసేన(UBT)కు చెందిన సామ్నా తన సంపాదకీయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ.. మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాలను మురికిగా మార్చేసింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)ను అజిత్ పవార్ భర్తీ చేస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పవార్(Ajit Pawar) ఈ కూటమితో కలిశారనుకోవడం లేదు. శిందే, ఆయన మద్దతుదారులపై త్వరలో అనర్హత వేటు పడుతుంది. పవార్‌కు పట్టాభిషేకం చేస్తారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రజలు అంగీకరించరు. రాష్ట్రంలో ఇదివరకు ఇలాంటి సంప్రదాయం లేదు. ప్రజలు ఇలాంటి వాటికి మద్దతు ఇవ్వరు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాము శివసేనను వీడటానికి ఎన్‌సీపీనే కారణమంటూ ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray)ను విమర్శిస్తూ శిందే వర్గం భాజపాతో కలిసింది. మరిప్పుడు ఆ పవార్‌ కూడా అక్కడికే వచ్చారు. ఇప్పుడు శిందే ఏం చేస్తారు..? ప్రమాణ స్వీకార సమయంలో శిందే వర్గం నేతల మొహంలో హావభావాలు.. వారి భవిష్యత్తు అంధకారమైందని స్పష్టం చేశాయి. వారు ప్రచారం చేసుకున్న హిందుత్వ ముగిసిపోయింది’ అని సామ్నా తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విషయంలో అజిత్ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దగ్గరి నుంచి ఆయన మూడుసార్లు ఆ పదవికి ప్రమాణం చేశారు.

మాట మార్చిన శిందే..

పవార్‌, ఆయన మద్దతుదారులను నిన్న ఏక్‌నాథ్‌ శిందే మహా సంకీర్ణ  ప్రభుత్వంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ తీరు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. కొద్దినెలల క్రితమే పవార్‌ తన వర్గంతో కలిసి భాజపా ప్రభుత్వంలో చేరతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై శిందే వర్గం స్పందిస్తూ.. ‘మా విధానం స్పష్టంగా ఉంది. ఎన్‌సీపీ ద్రోహం చేసే పార్టీ. పదవులు దక్కినా సరే.. మేం ఎన్‌సీపీతో ఉండం. భాజపా.. ఎన్‌సీపీ(NCP)ని తనతో చేర్చుకుంటే మహారాష్ట్ర పరిస్థితులు ఇలా ఉండవు. మేం బయటకు వెళ్లిపోతాం. మేం కాంగ్రెస్‌, ఎన్‌సీపీతో కలిసి నడిస్తే.. ప్రజలు మమ్మల్ని అంగీకరించరు’అని అప్పట్లో వ్యాఖ్యలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం భిన్నంగా ప్రవర్తించింది.

అజిత్‌ పవార్‌ వెళ్తారని ఊహించలేదు: ఎన్‌సీపీ నేత

‘భాజపా తమ పార్టీని విడదీయాలని కుట్రలు చేస్తుందని మాకు తెలుసు. కానీ అజిత్‌ పవార్(Ajit Pawar) తీసుకున్న అనూహ్య నిర్ణయం గురించి మాత్రం మేం ఊహించలేకపోయాం. వ్యక్తిగతంగా నాకు అజిత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా మాత్రం మేమంతా శరద్‌ పవార్‌కే మద్దతు ఇస్తాం’అని శరద్ పవార్‌ సమీప బంధువు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు