NCP: వారిపై అనర్హత వేటు వేయండి.. అర్ధరాత్రి వేళ స్పీకర్‌ వద్దకు!

అజిత్ పవార్‌ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్సీపీ కోరింది. ఈ నేతలు ఆదివారం అధికార పక్షంలో చేరిన విషయం తెలిసిందే.

Published : 03 Jul 2023 12:56 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఎన్సీపీ (NCP) నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికారపక్షంలో చేరారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే, అజిత్‌ వర్గానికి పార్టీ మద్దతు లేదని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని కోరుతూ.. అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ (Rahul Narwekar)ను ఎన్సీపీ అభ్యర్థించింది. నర్వేకర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

అజిత్‌ రాజీనామా అనంతరం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులైన ఎన్సీపీ నేత జితేంద్ర ఆహ్వాడ్‌ ఆదివారం అర్ధరాత్రి నర్వేకర్ నివాసంలో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందించినట్లు సమాచారం. దీనిపై స్పీకర్‌ సోమవారం మాట్లాడుతూ.. ‘అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ నాకు అందింది. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, తగిన చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు. అజిత్ పవార్‌తోపాటు ఎనిమిది మందిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఇప్పటికే వెల్లడించారు. పార్టీ శ్రేణులు శరద్ పవార్ వెంటే ఉన్నాయని తెలుపుతూ ఎన్నికల కమిషన్‌కు ఈ-మెయిల్ కూడా పంపినట్లు చెప్పారు.

అయితే, ఎంత మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు మద్దతు ఇచ్చారన్నదానిపై సమాచారం లేదని స్పీకర్‌ పేర్కొన్నారు. మరోవైపు.. అసెంబ్లీలో నూతన ప్రతిపక్ష నేత నియామకంపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా స్పీకర్‌కే ఉందన్నారు. ఇదిలా ఉండగా.. కొద్దికాలంగా శరద్‌ పవార్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న అజిత్‌ పవార్‌ తిరుగుబాటు చేశారు! అధికార పక్షంలో చేరడంతో ఎన్సీపీ నిలువున చీలినట్లయ్యింది. ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ తదితర ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అయితే, ఈ ఎమ్మెల్యేలను విశ్వాసఘాతకులుగా పిలవలేమని, వారు చేసిన పని ఇంకా రుజువు కాలేదని జయంత్‌ పాటిల్ అన్నారు. వారిలో చాలా మంది తమతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు.

కేంద్ర మంత్రి పదవిపై చర్చించలేదు.. ప్రఫుల్‌ పటేల్‌

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కాదని అజిత్‌ పవార్‌తో కలిసి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆయన అజిత్‌ పవార్‌ నివాసానికి చేరుకున్నారు. అయితే, కేంద్ర మంత్రి పదవిపై ఇంకా చర్చించలేదని ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపైనే చర్చలు జరిపినట్లు చెప్పారు. ఎన్సీపీ తమదేనని పేర్కొన్నారు. శరద్‌ పవార్‌ను వదిలేశారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని