Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Aug 2023 13:14 IST

1. చంద్రయాన్‌-3 మిషన్‌ వెనుక వీళ్ల కృషి..

జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-3 (Chadrayaan-3) వ్యోమనౌక అడుగుపెట్టే క్షణం కోసం యావత్ భారతావని ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. 41 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander) సన్నద్ధమైంది. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 మిషన్‌లో ఎంతో మంది ఇస్రో శాస్త్రవేత్తలు కీలకంగా వ్యవహరించారు. మరి, ఈ శాస్త్రవేత్తల బృందాలకు నాయకత్వం వహించిన కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సర్జరీ చేసి పొట్టలో దూది వదిలేసిన వైద్యులు.. బాలింత మృతి!

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలింత మృతి చెందింది. దర్శన్‌గడ్డ తండాకు చెందిన గిరిజన మహిళ రోజా నిండు గర్భిణి. ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈనెల 15న అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రిలో చేర్పించారు. ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే రోజున కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసిన వైద్యులు.. పొరపాటున కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. అనంతరం రోజాను డిశ్ఛార్జి చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రష్యా సూపర్‌సానిక్‌ లాంగ్‌రేంజి బాంబర్‌ ధ్వంసం..!

రష్యా(Russia)లోని కీలక స్థావరాలపై ఉక్రెయిన్‌ (Ukrain) డ్రోన్లు డాడులు చేసి భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. తాజగా రష్యాకు చెందిన సూపర్‌ సానిక్‌ విమానాలుండే షైకోవ్కా స్థావరంపై భారీగా బాంబింగ్‌ జరిగింది. ఇది ఉక్రెయిన్‌ సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత వారాంతంలో నోవ్‌గ్రోడ్‌లోని స్లాట్సీ మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌ పై కూడా దాడి జరిగినట్లు రష్యా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పలు వరసల్లోని రష్యా రక్షణ వ్యవస్థలను దాటుకొని వచ్చి ఉక్రెయిన్‌ డ్రోన్లు ఈ దాడులు చేయడం గమనార్హం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేను బతికే ఉన్నా.. అలాంటి రూమర్స్‌ బాధించాయి: హీత్‌ స్ట్రీక్

తాను మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు రావడంపై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్‌ స్ట్రీక్‌ (Heath Streak) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి కథనాలు మానసికంగా బాధకు గురి చేశాయని పేర్కొన్నాడు. తాను క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉన్నానని, బతికే ఉన్నట్లు స్పష్టం చేశాడు. ‘‘నేను కన్నుమూసినట్లు వచ్చిన వార్తలన్నీ రూమర్లే. అదంతా అబద్ధం. బతికే ఉన్నా.  చాలా బాగున్నా. ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే ఇలాంటి విషయాన్ని వ్యాప్తి చేయడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సయామీ ఖేర్ ‘వైవిధ్య’ బౌలింగ్‌.. అద్భుతమన్న సచిన్‌.. వీడియో వైరల్!

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్ (Sachin Tendulkar) ఎంతో మందికి స్ఫూర్తి. అతడికి అభిమానులు భారీ సంఖ్యలోనే ఉంటారు. వారిలో బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్ (Saiyami Kher) ఒకరు. చిన్నప్పటి నుంచి ఆరాధించిన సచిన్‌ తన సినిమాకు అభిమానిగా మారడంతో ఆమె ఆనందానికి ఆవధుల్లేవు. ఆమె నటనకు ప్రశంసలు కురిపించిన సచిన్‌..  ఆమె ఆటను స్వయంగా చూడాలనుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మహిళలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా?: ఎమ్మెల్సీ కవిత

పదేళ్లుగా పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పటికీ పార్లమెంట్‌లో మహిశా సభ్యులు కేవలం 12 శాతమేనని చెప్పారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే ఇప్పుడు 12శాతం మంది ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Fake work: గంట పనికి.. రూ.కోట్ల జీతమా..?

‘ఫేక్‌ వర్క్‌’ (Fake work) ఇటీవల టెక్‌ పరిశ్రమలను వేధిస్తోంది. కొందరు ఉద్యోగులు కొన్ని గంటలు మాత్రమే పని చేసి మిగతా సమయంలో ఖాళీగా ఉంటూ.. వేతనాలు పొందుతున్నారని ఆయా కంపెనీల సీఈవోలు చర్చలు జరిపారు. ఇటీవల ఫార్చూన్‌ (Fortune) పత్రిక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసింది. అతడు రోజుకు గంట మాత్రమే పని చేసి ఏడాదికి దాదాపు 1.50 లక్షల డాలర్ల (రూ. 1.2 కోట్లు)ను సంపాదిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారడంతో సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అసలు అతడు చేసే పనేంటంటే..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్‌.. త్రుటిలో తప్పించుకున్న చిరుత

తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. సుమారు 100 మంది సిబ్బందితో అటవీ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగించారు. అయితే ట్రాప్‌ నుంచి చిరుత, ఎలుగుబంటి త్రుటిలో తప్పించుకున్నాయి.  చిరుత బోన్‌కు సమీపంలోనికి వచ్చి వెనక్కి వెళ్లింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాటి సోమయాన్‌.. వాజ్‌పేయీ సూచనతో ‘చంద్రయాన్‌’గా మారి..!

జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) అడుగుపెట్టే మహోన్నత ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్‌ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చంద్రుడి (Moon)పై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూడో లూనార్‌ మిషన్‌ ఇది. అయితే జాబిల్లిపై ప్రయోగాలకు ఇస్రో మొదటగా అనుకున్న పేరు ‘చంద్రయాన్’ కాదట.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఘోరం.. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి

మిజోరం(Mizoram)లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో దాదాపు 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రాజధాని నగరం ఐజ్వాల్‌కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని