Mizoram: ఘోరం.. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి

మిజోరం(Mizoram)లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది. దాంతో పలువురు మృతి చెందారు. 

Updated : 23 Aug 2023 15:07 IST

ఐజ్వాల్‌: మిజోరం(Mizoram)లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో దాదాపు 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రాజధాని నగరం ఐజ్వాల్‌కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

సర్జరీ చేసి పొట్టలో దూది వదిలేసిన వైద్యులు.. బాలింత మృతి!

నిర్మాణ పనులు జరుగుతోన్న సమయంలో ఈ వంతెన కూలింది. ప్రమాద సమయంలో అక్కడ 35 నుంచి 40 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. వారిలో కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. ఈ ఘటనపై మిజోరం ముఖ్యమంత్రి జొరామ్‌థంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఐజ్వాల్‌ సమీపంలోని సైరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఘటన దృశ్యాలను షేర్ చేశారు.

మృతులకు ₹10లక్షల ఎక్స్‌గ్రేషియో: రైల్వే మంత్రి ప్రకటన

మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ₹10లక్షలు, తీవ్ర గాయాలైన వారికి ₹2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. మిజోరం ఘటన దురదృష్టకరమన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలతో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం, రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన వారికి ₹50వేలు చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు ట్వీట్‌ చేశారు. ఇప్పటివరకు 17 మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు చెబుతున్నారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదని.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు  తెలిపారు.

మోదీ దిగ్భ్రాంతి..

వంతెన దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారికి రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు