Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Sep 2023 13:09 IST

1. నా స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు పెట్టామనడం దిగ్భ్రాంతికరం: పీవీ రమేశ్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, గతంలో ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్‌ అన్నారు. ఈ కేసుపై గతంలో ఆయన సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తదితర పరిణామాల నేపథ్యంలో పీవీ రమేశ్‌ స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉంది: అచ్చెన్న

రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చెప్పారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో అచ్చెన్న నేతృత్వంలో తెదేపా నేతలు గవర్నర్‌ను కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ అనంతరం జరిగిన పరిణామాలు, ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముద్దు తెచ్చిన తంటా.. పదవి కోల్పోయిన ఫుట్‌బాల్‌ చీఫ్

తన దేశం ఫిఫా మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌(FIFA Women's World Cup)ను తొలిసారి గెలిచిందన్న ఆనందంలో స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్(Spanish soccer federation president) ప్రదర్శించిన అత్యుత్సాహం.. ఆయన పదవికే ఎసరు తెచ్చింది. సంబరాల్లో భాగంగా క్రీడాకారిణిని ముద్దాడి.. చివరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పటికే తన పదవి నుంచి సస్పెండైన ఆయన.. ప్రస్తుతం రాజీనామాను సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గద్వాల ఎమ్మెల్యేకు ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భాజపా ఓ ‘విషసర్పం’: మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు

నాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే (DMK) నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈ సారి ఆయన భాజపాను విష సర్పంతో పోల్చారు. ఆదివారం తమిళనాడులోని నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్‌ ఇంట జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బహిరంగంగా ఎంపీ మిథున్ రెడ్డి బర్త్‌డే వేడుకలు.. వైకాపాకు 144 సెక్షన్ వర్తించదా?

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 144సెక్షన్ అమల్లో ఉన్నా.. వైకాపా (YSRCP) నేతలు రోడ్లపై వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అధిక సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా సంబరాలు చేసుకున్నారు. ఇదంతా చూసినప్పటికీ పోలీసులు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  మీ పన్ను రూ.10 వేలు దాటుతుందా? అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిందే!

ఆదాయ పన్ను విభాగం ఇటీవల దేశంలో ఐదు లక్షల మందికి నోటీసులు పంపింది. వీరంతా ముందస్తు పన్ను చెల్లింపు నిబంధనలను పాటించలేదని పేర్కొంది. నిర్దేశిత మొత్తం చెల్లించని.. లేదా కనీసం ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ (Advance Tax) చెల్లించని వారందరికీ నోటీసులు అందాయి. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య వీటిని పంపింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికం వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించి ఐటీ విభాగం ఈ నోటీసులను పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దుర్గగుడి వద్ద రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గ గుడి కేశ ఖండన శాల సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుర్గ గుడి అధికారులు ప్రత్యేక క్రేన్‌లు తెప్పించి రోడ్డుపై పడిన కొండ రాళ్లను తొలగిస్తున్నారు. సమీపంలోని సబ్‌వేను కూడా మూసివేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జీ-20 విందుకు ఆమె వెళ్లకపోయుంటే.. ఆకాశమేమీ ఊడిపడేది కాదుగా : అధీర్‌ రంజన్‌ చౌధరి

కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి (Adhir Ranjan Chowdhury) పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)పై విమర్శలు గుప్పించారు. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్వహించిన జీ -20 విందుకు మమతా హాజరు కావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో కీలక నేత అయిన ఆమె.. ఈ విందుకు హాజరుకావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జీమెయిల్‌ స్టోరేజీ ఫుల్‌ అని చూపిస్తోందా? ఇలా క్లీనప్‌ చేసుకోండి..

ఆండ్రాయిడ్‌ ఫోన్లు, కంప్యూటర్లు వాడేవారందరికీ గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌ వంటి గూగుల్‌ సర్వీసులు సుపరిచితమే. సాధారణంగా ఏళ్లుగా వాడుతున్న వారికి గూగుల్‌ ఉచితంగా అందించే 15GB క్లౌడ్‌ స్టోరేజీ దాదాపు పూర్తయిపోయి ఉంటుంది. ఒకవేళ స్టోరేజీ పూర్తయితే గూగుల్‌ వన్‌ అకౌంట్‌ తీసుకుని నెలకు రూ.130 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని