Udhayanidhi Stalin: భాజపా ఓ ‘విషసర్పం’: మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన భాజపాపై గురిపెట్టారు. ఆ పార్టీని విష సర్పంతో పోల్చారు. పనిలోపనిగా అన్నాడీఎంకేను చెత్తగా అభివర్ణించారు. 

Published : 11 Sep 2023 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే (DMK) నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈ సారి ఆయన భాజపాను విష సర్పంతో పోల్చారు. ఆదివారం తమిళనాడులోని నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్‌ ఇంట జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష అన్నాడీఎంకే పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందని అభివర్ణించారు.

ఇటీవల డీఎంకే నేత మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా మాట్లాడుతూ ప్రధాని మోదీని పాముగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘విష సర్పం మీ ఇంట్లోకి వస్తే.. దానిని తీసి బయట పడేస్తే కుదరదు. అది మీ ఇంటి చుట్టుపక్కల చెత్తలో దాక్కొంటుంది. ఆ చెత్తను తీసేసే వరకూ అది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఈ సన్నివేశంతో ప్రస్తుత పరిస్థితి పోలిస్తే.. తమిళనాడు మన ఇల్లు. భాజపా ఓ విష సర్పం. అన్నాడీఎంకే మన ఇంటి వద్ద ఉన్న చెత్తలాంటిది. మనం చెత్తను తీసే వరకు విష సర్పం దూరం కాదు. భాజపా నుంచి విముక్తి పొందాలంటే.. అన్నాడీఎంకేను తొలగించాలి’’ అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.  

ఇటీవల ‘తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ నిర్వహించిన ‘సనాతన నిర్మూలన’ అనే సదస్సులో ఉదయనిధి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ దుమారానికి దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు