Advance Tax: మీ పన్ను రూ.10 వేలు దాటుతుందా? అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిందే!

Advance Tax: అసలు అడ్వాన్స్‌ ట్యాక్‌ (Advance Tax) అంటే ఏంటి? ఎవరు చెల్లించాలి? ఎప్పటిలోగా చెల్లించాలి? వంటి వివరాలను పరిశీలిద్దాం..!

Updated : 11 Sep 2023 13:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ పన్ను విభాగం ఇటీవల దేశంలో ఐదు లక్షల మందికి నోటీసులు పంపింది. వీరంతా ముందస్తు పన్ను చెల్లింపు నిబంధనలను పాటించలేదని పేర్కొంది. నిర్దేశిత మొత్తం చెల్లించని.. లేదా కనీసం ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ (Advance Tax) చెల్లించని వారందరికీ నోటీసులు అందాయి. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య వీటిని పంపింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికం వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించి ఐటీ విభాగం ఈ నోటీసులను పంపింది. ఈ నేపథ్యంలో అసలు అడ్వాన్స్‌ ట్యాక్‌ (Advance Tax) అంటే ఏంటి? ఎవరు చెల్లించాలి? ఎప్పటిలోగా చెల్లించాలి? వంటి వివరాలను పరిశీలిద్దాం..!

అడ్వాన్స్ ట్యాక్స్ అంటే..

రాబోయే ఆదాయాన్ని అంచ‌నా వేసి ముంద‌స్తుగా చెల్లించే పన్నునే అడ్వాన్స్ ట్యాక్స్ (Advance Tax) అంటారు. ఈ ముందస్తు ప‌న్నును ఒకే సారి సంవ‌త్సరం చివ‌ర‌ కాకుండా ద‌శ‌ల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎవ‌రెవ‌రు చెల్లించాలి..

అంచ‌నా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను రూ.10వేలు లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్ (Advance Tax) చెల్లించాలి. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల‌ విషయానికి వస్తే.. యాజమాన్యాలు వేతనం నుంచి ‘మూలం వద్ద పన్ను’ను డిడక్ట్‌ చేస్తాయి గనక ప్రత్యేకంగా వారు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఒకవేళ వేతనం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు ఉన్నట్లయితే మాత్రం నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు కొత్త కంపెనీలో.. గత వేతన వివరాలను అందించాల్సి ఉంటుంది. తద్వారా టీడీఎస్‌ను వారు నిబంధనల ప్రకారం సర్దుబాటు చేస్తారు.

యాన్యుటీ.. జీవితాంతం పింఛను వచ్చేలా

ఎవ‌రు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదంటే..

ఏదైనా ఆర్థిక సంవ‌త్సరంలో అంచ‌నా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్ను విలువ రూ.10 వేల కంటే త‌క్కువ ఉన్న వారెవ‌రూ అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. 60 సంవ‌త్సరాలు పైబ‌డి ఎలాంటి వ్యాపార‌, వృత్తిగ‌త ఆదాయం లేని సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు కూడా దీని నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎలా లెక్కించాలి?

ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో అందే అన్ని ర‌కాల ఆదాయాల‌ను అంచ‌నా వేయాలి. ఇలా అంచ‌నా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న ప‌న్ను మిన‌హాయింపుల‌ను తీసివేయాలి. ఆ త‌ర్వాత మిగిలిన ఆదాయంపై ప‌న్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం ప‌న్ను విలువ రూ.10 వేలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే ముంద‌స్తు ప‌న్ను చెల్లించాలి. నిర్దేశించిన తేదీ లోపు ద‌శ‌ల వారీగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి.

అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే గ‌డువు

  • జూన్ 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 15 శాతం చెల్లించాలి
  • సెప్టెంబ‌ర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 45 శాతం అడ్వాన్స్ చెల్లించాలి
  • డిసెంబ‌ర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే క‌ట్టిన ముంద‌స్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి
  • మార్చి 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్ను 100 శాతం నుంచి అప్పటికే క‌ట్టిన ముందస్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి

** సెక్షన్‌ 44AD ప్రకారం ‘ప్రిసంప్టివ్‌ ట్యాక్స్‌’ రిజైమ్‌ను ఎంచుకున్నవారు 15 మార్చి లేదా అంతకంటే ముందు ఒకేసారి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, కన్సల్టెంట్లు తదితరులు సైతం Section 44ADA ప్రకారం ‘ప్రిసంప్టివ్‌ ట్యాక్స్‌’ రిజైమ్‌ కిందకే వస్తారు. వారు కూడా మార్చి 15 లేదా అంతకంటే ముందే ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

క్రెడిట్‌ స్కోరు తగ్గితే... వడ్డీ భారం

ఒకవేళ ఆల‌స్యమైతే..

నిర్దేశించిన గ‌డువులోగా ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌క‌పోతే దానిపై ఆదాయ‌ప‌న్ను శాఖ జరిమానా విధిస్తుంది. సెక్షన్ 234C ప్రకారం.. గడవులోగా చెల్లించాల్సిన పన్నుపై ఒక శాతం వడ్డీ పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్‌ 234B ప్రకారం.. ఆర్థిక సంవ‌త్సరం చివ‌రి వ‌ర‌కు చెల్లించిన ముంద‌స్తు పన్ను, మొత్తం ప‌న్నులో 90 శాతం మించ‌క‌పోయినా లేదా పూర్తిగా చెల్లించ‌క‌పోయినా బ‌కాయి ఉన్న ప‌న్ను మొత్తంపై నెల‌కు 1% వ‌డ్డీ వసూలు చేస్తుంది. సెక్షన్ 234A ప్రకారం.. చివ‌రి తేదీ త‌ర్వాత చెల్లిస్తే బకాయిపడ్డ పన్ను మొత్తంపై నెల‌కు 1% వ‌డ్డీ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. పన్ను వర్తించే ఆర్థిక సంవత్సరం మొదలుకొని చెల్లించిన తేదీ వరకు ఈ పెనాల్టీని లెక్కిస్తారు.

ఎక్కువ చెల్లిస్తే..

ఒక‌వేళ మీరు చెల్లించాల్సిన వాస్తవ ప‌న్ను (అడ్వాన్స్ ట్యాక్స్ లేదా టీడీఎస్‌) కంటే ఎక్కువ చెల్లిస్తే, రిఫండ్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే రిఫండ్ పొందేందుకు త‌ప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని