Congress: జీ-20 విందుకు ఆమె వెళ్లకపోయుంటే.. ఆకాశమేమీ ఊడిపడేది కాదుగా : అధీర్‌ రంజన్‌ చౌధరి

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ జీ-20 విందుకు హాజరుకావడంపై కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధరి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated : 11 Sep 2023 12:15 IST

దిల్లీ : కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి (Adhir Ranjan Chowdhury) పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)పై విమర్శలు గుప్పించారు. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్వహించిన జీ -20 విందుకు మమతా హాజరు కావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో కీలక నేత అయిన ఆమె.. ఈ విందుకు హాజరుకావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘జీ-20 విందుకు ఆమె వెళ్లకపోయుంటే.. ఆకాశమేమీ ఊడి పడేది కాదుగా’ అంటూ మమతా బెనర్జీ హాజరు కావడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆమె ఈ విందులో పాల్గొనడానికి ఇంకేమైనా కారణం ఉందా..? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. డిన్నర్‌ టేబుల్ వరుసలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పక్కన మమతా బెనర్జీ కుర్చీ ఉండటంపై ఆయన విమర్శలు గుప్పించారు. పలువురు విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొనడం మానుకున్నారని, అయితే మమతా బెనర్జీ విందుకు ముందుగానే దిల్లీ చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు.

విందు శనివారం అయితే బెనర్జీ శుక్రవారమే దిల్లీకి వచ్చారు. ప్రణాళిక ప్రకారం ఆమె శనివారం దిల్లీకి రావాలి. అయితే దిల్లీలో విమాన కార్యకలాపాల నిబంధనల కారణంగా ఆమె ప్రయాణించాల్సిన విమానం శుక్రవారం మధ్యాహ్నానికి రీషెడ్యూల్ చేశారని మీడియా తెలిపింది.

అధీర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యలకు టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్‌  స్పందిస్తూ.. ‘పశ్చిమ బెంగాల్ సీఎం ఎప్పుడు వెళ్లాలనేది మీరు నిర్ణయించరు. ఆమె ఇండియా కూటమిలో ఒకరని అందరికి తెలుసు. ఆమె ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రొటోకాల్‌ను అనుసరించారు. దాని గురించి ఆమెకు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు ’ అని అధీర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యలను సేన్‌ తిప్పికొట్టారు.

ఈ విందు కార్యక్రమానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ (nithish kumar), ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) హాజరుకాగా.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్,  చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ముఖ్యమంత్రులు హాజరుకాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని