Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 25 May 2023 21:25 IST

1. ‘జనరల్‌ రూట్‌ పాస్‌’తో బస్సులో ఎన్నిసార్లయినా తిరగొచ్చు: టీఎస్‌ఆర్టీసీ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల కోసం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’ను టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్‌ను తీసుకురానుంది. 8కి.మీ. పరిధిలో రాకపోకలకు వర్తించే రూట్‌ బస్‌ పాస్‌ను మే27 నుంచి అందుబాటులోకి వస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈమేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఐఆర్‌బీ డెవలపర్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారు: రఘునందన్‌

ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ విషయంలో సీబీఐకి ఫిర్యాదు చేశామని, ఈవిషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘ఆర్డినెన్స్‌’పై పోరాటం ముమ్మరం.. శరద్‌ పవార్‌తో కేజ్రీవాల్‌ భేటీ!

దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌(Ordinance)పై ఆప్‌ ప్రభుత్వం తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆయా పార్టీల మద్దతు కూడగడుతోన్న దిల్లీ సీఎం, ఆప్‌ (AAP) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. తాజాగా ఎన్సీపీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar)ను కలిశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఫైనల్‌లో ఆ జట్టును ఓడిస్తేనే అసలైన మజా: దీపక్ చాహర్‌

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్ (CSK) దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహర్‌ తన మనసులోని భావాలను బయటపెట్టాడు. గాయం నుంచి కోలుకోని రావడం, సీఎస్‌కే ఫైనల్‌కు చేరడం, టైటిల్‌ కోసం ఎవరితో తలపడాలని ఉంది.. వంటి విషయాలపై మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పోలీసుల థర్డ్‌ డిగ్రీపై హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

పోలీసుల థర్డ్‌ డిగ్రీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే కాలం కాదన్న హోం మంత్రి .. ప్రత్యామ్నాయంగా ఫోరెన్సిక్‌ విభాగాలను వాడుకోవాలని సూచించారు. అసోం గువాహటిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీకి అమిత్‌ షా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘర్షణలపైనా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆగని చీతాల మరణాలు.. మరో రెండు కూనలు మృతి!

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో చీతాల వరుస మరణాలు కలవరపరుస్తున్నాయి. మంగళవారమే ఓ చీతా కూన మృత్యువాత పడగా.. రెండు రోజుల వ్యవధిలోనే తాజాగా మరో రెండు చీతా కూన (Cheetah Cubs)లు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీహైడ్రేషన్‌ కారణంగానే అవి మృతి చెందినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఈసారి అమూల్‌ vs అవిన్‌.. తమిళనాడులో పాల రగడ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కన్నడ నాట ‘అమూల్‌ (Amul)’ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా మరో దక్షిణాది రాష్ట్రంలోనూ ఈ వివాదం మొదలైంది. గుజరాత్‌కు చెందిన ఈ ప్రముఖ డైరీ బ్రాండ్‌.. తమిళనాడు (Tamil nadu)లో పాలను సేకరిచేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. రాష్ట్రం ప్రభుత్వ డైరీ సంస్థ అవిన్‌ (Aavin) బ్రాండ్‌కు ఆదరణ తగ్గే ప్రమాదముందని ఆందోళనలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అంగారకుడి నుంచి సందేశం.. గ్రహాంతరవాసులు పంపినదేనా?

 కేవలం భూమి (Earth) మీదనే జీవజాలం ఉందా? ఈ సువిశాల అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ గ్రహాంతరవాసులు (Aliens) జీవిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆర్థిక మాంద్యంలోకి జర్మనీ

కరోనా మహమ్మారి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలపై ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో (Largest Economy) నాలుగో స్థానంలో ఉన్న జర్మనీపైనా (Germany) దీని ప్రభావం పడింది. కొంతకాలంగా అక్కడ కొనసాగుతోన్న అధిక ద్రవ్యోల్బణం (Inflation), ఇంధన సంక్షోభం వంటి పరిస్థితులతో జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి (Recession) జారిపోతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. విద్యార్థి వీసాల్లో మార్పుతో.. జాబ్స్‌కు బ్యాక్‌డోర్‌ బంద్‌: యూకే మంత్రి

విదేశీ విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి బ్రిటన్‌ (Britain) ఇటీవల స్వస్తి పలికింది. ఈ మేరకు విదేశీ విద్యార్థులకు వీసాల (Student Visa)ను మరింత కఠినతరం చేసింది. అయితే, వలసలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ (Suella Braverman) వెల్లడించారు. అంతేగాక, ఉద్యోగాల్లో బ్యాక్‌డోర్‌ ఎంట్రీలను ఇది అడ్డుకుంటుందని ఆమె పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని