Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Aug 2023 16:59 IST

1. చంద్రుడిపై కూలిపోయిన లూనా-25

చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమయ్యింది. జాబిల్లిపై అడుగు పెట్టడానికి ముందే ల్యాండర్‌ కుప్పకూలిపోయింది. రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్‌’ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం అది కూలిపోయినట్లు తెలిపింది. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరినట్లయ్యింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పాడేరు వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి

అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ అదుపు తప్పి ఏడు పల్టీలు కొట్టి 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సీడబ్ల్యూసీ పునర్‌వ్యవస్థీకరణ..

త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌(Congress) సంస్థాగతంగా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీని పునర్‌వ్యవస్థీకరించింది. మొత్తంగా 84 మందితో విడుదల చేసిన జాబితాలో 39మందిని సీడబ్ల్యూసీ జనరల్‌ సభ్యులుగా ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. 18 మందిని CWC శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇంఛార్జిలుగా, తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురిని ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విజయవాడ వైకాపాలో ‘త్రీ ఇడియట్స్‌’: తెదేపా నేతల విమర్శ

విజయవాడ వైకాపాలో దేవినేని అవినాష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు ‘త్రీ ఇడియట్స్‌’లా ఉన్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.  వెల్లంపల్లి శ్రీనివాస్‌ దుర్గగుడిలో లింగాలు మింగాడు కాబట్టే మంత్రి పదవి పోయిందని విమర్శించారు. నిన్న విజయవాడలో జరిగిన లోకేష్‌ పాదయాత్ర చూసి వైకాపా నాయకులకు మతిపోయిందని ఎద్దేవా చేశారు. వందమంది జగన్‌లు వచ్చినా  చంద్రబాబు విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నిర్మల్‌లో భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్‌.. కిషన్‌ రెడ్డి ఆగ్రహం

నిర్మల్‌లో నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఇంటి ముట్టడికి  యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. ఈ ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హైదరాబాద్‌కు చేరుతున్న ‘భారాస’ పంచాయితీలు

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 21వ తేదీనే అభ్యర్థుల మొదటి జాబితాను భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో టికెట్‌ ఆశిస్తున్న నేతలు పార్టీ ముఖ్యులను కలిసి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ కవితను ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలిశారు. ఇద్దరిలో ఒకరికి ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వాలని కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తండ్రిని చంపేసి.. మూడు రోజులు ఇంట్లోనే దాచి.. ఆపై..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లిలో భూ తగాదాలతో తండ్రిని కుమారుడు హతమార్చాడు. ఈ నెల 16న ధనుంజయ్‌ తన తండ్రి తిరుపతిని కర్రతో దాడి చేసి హత్య చేశాడు. 3 రోజుల పాటు తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచి ఉంచాడు. తండ్రి కనిపించడం లేదంటూ 3 రోజులు ఊరు మొత్తం తిరిగాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్‌

రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన డ్రోన్‌ (Unmanned Aerial Vehicle) ఆదివారం కర్ణాటకలో కుప్పకూలింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్‌ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాల్లో డ్రోన్‌ కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అంగుళం భూమి కూడా చైనా తీసుకోలేదనడం అవాస్తవం : రాహుల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఒక్క అంగుళం భూమి కూడా మనం కోల్పోలేదని ప్రధాని చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. మన భూభాగంలోకి చైనా ఆర్మీ (China Army) ప్రవేశించిందన్న విషయం ఇక్కడి స్థానికులు చెప్పారని అన్నారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తోన్న ఆయన (Rahul Gandhi).. సరిహద్దు పాంగాంగ్‌ సరస్సు (Pangong Lake) ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌ యాత్ర సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్నేహితుడి కుమార్తెపై.. ఉన్నతాధికారి అత్యాచారం..!

స్నేహితుడి మైనర్‌ కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక ఉన్నతాధికారి. దిల్లీ (Delhi)లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక సీనియర్‌ అధికారి (పేరు తెలపలేదు) స్నేహితుడు 2020లో మరణించాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని