Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యా ల్యాండర్‌ లూనా-25

చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌ కుప్పకూలిపోయింది.

Updated : 20 Aug 2023 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమయ్యింది. జాబిల్లిపై అడుగు పెట్టడానికి ముందే ల్యాండర్‌ కుప్పకూలిపోయింది. రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్‌’ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం అది కూలిపోయినట్లు తెలిపింది. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరినట్లయ్యింది. ‘జాబిల్లి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్‌.. అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించింది. అనంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది’ అని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ ప్రకటించింది.

ఇలా 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా పంపిన ఈ ల్యాండర్‌ 21వ తేదీన దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ల్యాండింగ్‌కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్‌ ఆర్బిట్‌)కు చేరడానికి లూనా-25 శనివారం కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రోస్‌కాస్మోస్‌ గుర్తించింది. అప్పటికే వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్లు తెలిపింది.

ఇదిలాఉంటే, లూనా-25ని ఈ నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. దాదాపు పదిరోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్‌.. కొన్ని గంటల క్రితమే చంద్రుడి ఫొటోలనూ పంపించింది. మరికొన్ని గంటల్లోనే అక్కడ దిగేందుకు సిద్ధమైన సమయంలో అది క్రాష్‌ అయ్యింది. మరోవైపు భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3.. ఈ నెల 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రదేశంలో దిగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని