Rahul Gandhi: అంగుళం భూమి కూడా చైనా తీసుకోలేదనడం అవాస్తవం : రాహుల్

భారత్‌కు చెందిన ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పిన వాదనల్లో వాస్తవం లేదని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 20 Aug 2023 14:10 IST

లేహ్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఒక్క అంగుళం భూమి కూడా మనం కోల్పోలేదని ప్రధాని చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. మన భూభాగంలోకి చైనా ఆర్మీ (China Army) ప్రవేశించిందన్న విషయం ఇక్కడి స్థానికులు చెప్పారని అన్నారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తోన్న ఆయన (Rahul Gandhi).. సరిహద్దు పాంగాంగ్‌ సరస్సు (Pangong Lake) ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌ యాత్ర సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మన భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించిందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇంతకుముందు పశువుల మేతకు వినియోగించిన ప్రదేశానికి ఇప్పుడు వెళ్లలేకపోతున్నామని అంటున్నారు. ఒక్క అంగుళం కూడా మన భూమి కోల్పోలేదని ప్రధాని చెబుతున్న మాటలు వాస్తవం కాదని వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. లద్దాఖ్‌లో ఎవర్ని అడిగినా.. ఇదే విషయం చెబుతారు’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందనడానికి ఇదే సరైన ఆధారమన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అంగీకరించకపోతే దేశానికి అన్యాయం చేసినట్లేనన్నారు.

పాంగాంగ్‌ సరస్సుకు రాహుల్‌ బైక్‌ యాత్ర

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ (Rajiv Gandhi) 79వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాహుల్‌.. ఆర్టికల్‌ 370 రద్దుపైనా మాట్లాడారు. వీరికి కల్పించిన హోదాపై ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరని.. దీనిపై స్థానికులు నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వారు మరింత ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నారని.. నిరుద్యోగం కూడా ఆందోళకరమైన అంశమన్నారు. అధికారుల చేతుల్లో రాష్ట్రం నడవవద్దని.. ప్రజాప్రతినిధులతోనే పాలన సాగాలని ఇక్కడి ప్రజలు చెబుతున్నట్లు రాహుల్‌ గాంధీ వెల్లడించారు. భారత్‌ జోడో యాత్ర సమయంలోనే ఇక్కడ పర్యటించాలనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదన్నారు. అందుకే ఈ ప్రాంతంలో ప్రస్తుతం పర్యటిస్తున్నానన్నారు.

మరోవైపు ఆగస్టు 25 వరకూ లేహ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ.. అక్కడ జరిగే ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను కూడా వీక్షిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ - కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు సెప్టెంబర్ 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురితో రాహుల్‌ భేటీ కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని