Top 10 News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 13 Jul 2023 09:01 IST

1. రాయితీ ధరకు టమాటా!

భారీగా పెరుగుతున్న టమాటా ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. టమాటా అధికంగా పండే రాష్ట్రాల నుంచి సేకరించి అధిక ధరలున్న దిల్లీ, ఇతర రాష్ట్రాల్లో సబ్సిడీ ధరకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లలోనూ 30శాతం సబ్సిడీ ధరకు టమాటాలను కేంద్రం అందించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోడికత్తి కేసులో కుట్రకోణం లేదన్న ఎన్‌ఐఏ

కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని, క్షుణ్ణంగా దర్యాప్తు చేసినందున మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి రెండో రోజైన బుధవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ఇన్‌-కెమెరా పద్ధతిలో విచారణ సాగింది. ఈ అంశంపై లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్‌ చేసిన అభ్యర్థనపై తాము ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేశామని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది విశాల్‌ గౌతమ్‌ కోర్టుకు నివేదించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల స్వయంగా ఆలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అక్కడే నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆలయ అభివృద్ధికి రూ.అయిదారు వందల కోట్లైనా ఖర్చు చేస్తామని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలు

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనానికి మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం మొత్తంగా 72,664 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణ ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఏపీది అపోహే

గోదావరిపై కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనడం అపోహ మాత్రమేనని కేంద్ర జలసంఘం స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రానికి గోదావరిలో ఉన్న నీటిని పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఎవరికెంత కేటాయించాలనే విషయాన్ని ట్రైబ్యునల్‌ తేల్చలేదని పేర్కొనడాన్నీ తోసిపుచ్చింది. గోదావరిలో ఏపీ వినియోగం 531.908 టీఎంసీలు మాత్రమేనని స్పష్టం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బంగారం కింద కోట్ల ఏళ్లనాటి మట్టీమశానం

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారం ఖనిజ నిక్షేపాల కింద అత్యంత పురాతన హిమానీనద అవశేషాలను కనుగొన్నట్లు దక్షిణాఫ్రికా, అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ అవశేషాలు 290 కోట్ల ఏళ్లనాటి హిమానీనదాల సంబంధించినవి. మంచు గడ్డగా ఉండే హిమానీనదం కరిగి నీరయ్యేటప్పుడు రాళ్లూమట్టీ కొట్టుకువస్తాయి. దక్షిణాఫ్రికాలో బయటపడినవి సరిగ్గా ఆ శిథిలాలే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నెలల్లోకొచ్చేశాం.. ఎన్నికలకు సిద్ధం కండి

నెలల్లోకి వచ్చేశాం... 8, 9 నెలల్లో ఎన్నికలుంటాయి. మీ జిల్లాల బాధ్యత మీదే. జగనన్న సురక్ష చాలా బాగా జరుగుతోంది. దీంతో మంచి మైలేజీ వస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనేలా చూడండి. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మిగిలిపోయిన ఇళ్లకూ తిరగండి’ అని మంత్రుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో... అధికారులు బయటకు వెళ్లాక సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమ్మకాలిక్కడ... ఆదాయం అక్కడ!

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ప్రజలకు విక్రయాలు చేస్తున్న వాణిజ్య సంస్థలు చెల్లిస్తున్న సమగ్ర వస్తు, సేవల పన్ను(ఐజీఎస్టీ) రాష్ట్రానికి సక్రమంగా రావడం లేదు. పలు సంస్థలు చిరునామాలు ఇతర రాష్ట్రాల పేరుతో నమోదు చేసి... ఇక్కడ వ్యాపారం చేస్తున్నందున ఈ పరిస్థితి ఉన్నట్లు రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ గుర్తించింది. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన రూ.200 కోట్లకు పైగా ఐజీఎస్టీటీ ఇతర రాష్ట్రాల ఖాతాలకు చేరినట్లు తేలింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎన్నికల వ్యూహాల ఖరారులో భాజపా

భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన బుధవారం దిల్లీలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో నిర్వహించే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయావకాశాలను మెరుగుపరచుకోవడంపై చర్చించుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఎదుర్కొన్న 160 నియోజకవర్గాల్లోనూ గెలవడంపై ప్రధానంగా దృష్టి సారించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని