తెలంగాణ ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఏపీది అపోహే

గోదావరిపై కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనడం అపోహ మాత్రమేనని కేంద్ర జలసంఘం స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రానికి గోదావరిలో ఉన్న నీటిని పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఎవరికెంత కేటాయించాలనే విషయాన్ని ట్రైబ్యునల్‌ తేల్చలేదని పేర్కొనడాన్నీ తోసిపుచ్చింది.

Updated : 13 Jul 2023 06:55 IST

ఆ రాష్ట్రంపై ఎలాంటి  ప్రభావం ఉండదు
కేటాయింపులు జరిగే వరకు.. అనుమతులు ఆపలేం
గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌   వినియోగం 531.908 టీఎంసీలు మాత్రమే
మోదికుంటవాగు, గూడెం ఎత్తిపోతల టీఏసీ నోట్‌లో జలసంఘం స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరిపై కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనడం అపోహ మాత్రమేనని కేంద్ర జలసంఘం స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రానికి గోదావరిలో ఉన్న నీటిని పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఎవరికెంత కేటాయించాలనే విషయాన్ని ట్రైబ్యునల్‌ తేల్చలేదని పేర్కొనడాన్నీ తోసిపుచ్చింది. గోదావరిలో ఏపీ వినియోగం 531.908 టీఎంసీలు మాత్రమేనని స్పష్టంచేసింది. తెలంగాణ చేపట్టిన మోదికుంటవాగు, కడెం-గూడెం ఎత్తిపోతల పథకాలకు అనుమతిపై ఈ నెల 14న కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సమావేశం నిర్వహించనుంది. వీటిపై తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర భాగస్వామ్య రాష్ట్రాలకు పంపిన జలసంఘం వాటి అభిప్రాయాలను కోరింది. గోదావరిలో రెండు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ జరగలేదని, ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువనున్న తమకు నష్టం వాటిల్లుతుందని, కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఇతర రాష్ట్రాలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఈ మేరకు జలసంఘం తయారు చేసిన సాంకేతిక నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అందులో ఏముందంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ మా పరిశీలనలో లేదు. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి పంపిణీకి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు. మొత్తం బేసిన్‌కు అమలులో ఉన్న గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ఆధారంగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను పరిశీలించడానికి మార్గదర్శకాలు ఉన్నాయి.

ట్రైబ్యునల్‌ అవార్డు లేకపోవడం, అంతర్రాష్ట్ర జల ఒప్పందం జరగకపోవడం, కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు కాకపోవడం వంటివి ఉంటే... అంతర్రాష్ట్ర రివర్‌ బేసిన్‌లో ఉన్న  ప్రాజెక్టును జాగ్రత్తగా పరిశీలించి, ఎగువ, దిగువ ప్రాంతాల్లో భవిష్యత్తులో జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, కొత్త ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నీటి పంపిణీకి సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది... అయితే ఈ ఒప్పందాలు జరిగే వరకు కేంద్ర జలసంఘం ఎదురుచూడదు. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా డీపీఆర్‌లను పరిశీలిస్తుంది. కేంద్ర జలసంఘం వద్ద ఉన్న సమాచారం, 2021 జులై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌, ఆమోదించిన ప్రాజెక్టులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014 జనవరి 2న రాసిన లేఖ, 2021 అక్టోబరు 9న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన సమాచారం, ఇదే అంశంపై 2022 ఫిబ్రవరి ఒకటి, అదే ఏడాది మార్చి 24న రాసిన వివరణ లేఖలను పరిగణనలోకి తీసుకోగా... గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌ వినియోగం 531.908 టీఎంసీలుగా లెక్క తేలింది. ఇంతకుమించి ఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన జలసంఘం వద్ద ఎలాంటి డీపీఆర్‌లు లేవు. పైవినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అంతర్రాష్ట్ర కోణంలో మోదికుంటవాగుకు నీటి లభ్యత ఆమోదం తెలిపాం. నీటి లభ్యత అన్నది ప్రతిపాదిత ప్రాజెక్టు వద్ద మాత్రమే చేయాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎలా లెక్కగట్టామో, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఆమోదం తెలపడానికి కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాం. జలసంఘం నీటి లభ్యతపై చేసిన అధ్యయనాన్ని ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించాల్సిందే’’ అని జలసంఘం స్పష్టంచేసింది.

రూ.638 కోట్లతో రెండు ప్రాజెక్టులు

  • తెలంగాణ ప్రభుత్వం ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో 2.25 టీఎంసీల నీటి వినియోగంతో మోదికుంటవాగు ప్రాజెక్టును చేపట్టింది. 21,349 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా 2.07 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టే దీని నిర్మాణ వ్యయం రూ.500.26 కోట్లు.
  • 1958లో నిర్మించిన కడెం రిజర్వాయరు నిల్వ సామర్థ్యం 7.60 టీఎంసీలు. పూడిక పెరగడంతో అది 4.699 టీఎంసీలకు పడిపోయింది. దీంతో చివర ఆయకట్టుకు నీరందడంలేదు. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి వెనుకభాగం (బ్యాక్‌వాటర్‌)లో కడెం-గూడెం ఎత్తిపోతల పథకాన్ని రూ.138 కోట్లతో 2015లో ప్రతిపాదించారు. దీని ద్వారా మళ్లించే నీటిని కడెం ఎడమ ప్రధాన కాలువ 58.4 కి.మీ వద్ద వేసి 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం దీని లక్ష్యం. ఈ రెండింటి అనుమతిపై సిఫార్సు చేసేందుకే 14న జలసంఘం టీఏసీ సమావేశం జరగనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు