రాయితీ ధరకు టమాటా!

భారీగా పెరుగుతున్న టమాటా ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. టమాటా అధికంగా పండే రాష్ట్రాల నుంచి సేకరించి అధిక ధరలున్న దిల్లీ, ఇతర రాష్ట్రాల్లో సబ్సిడీ ధరకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Published : 13 Jul 2023 04:37 IST

రంగంలోకి దిగిన కేంద్రం
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సేకరణకు నిర్ణయం
నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌కు నిర్దేశం

ఈనాడు, దిల్లీ: భారీగా పెరుగుతున్న టమాటా ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. టమాటా అధికంగా పండే రాష్ట్రాల నుంచి సేకరించి అధిక ధరలున్న దిల్లీ, ఇతర రాష్ట్రాల్లో సబ్సిడీ ధరకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లలోనూ 30శాతం సబ్సిడీ ధరకు టమాటాలను కేంద్రం అందించనుంది. ఇందులో భాగంగా టమాటా అధికంగా పండే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సేకరించాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌), జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌)లను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ బుధవారం ఆదేశించింది. దిల్లీ రాజధాని ప్రాంతంలో శుక్రవారం నుంచి వినియోగదారులకు రాయితీ ధరకు టమాటాను పంపిణీ చేయాలని సూచించింది. దేశవ్యాప్త సగటు కంటే ఎక్కువ ధరలు పలుకుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడికీ సరఫరా చేయాలని ఆదేశించింది. దేశంలో 56-58% టమాటా పంట దక్షిణ, పశ్చిమ ప్రాంతం నుంచి వస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో వినియోగం కంటే ఎక్కువగా టమాటాలు వస్తున్నాయి. ఈ పంట సాగు డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అత్యధికంగా ఉంటుంది. జులై-ఆగస్టు, అక్టోబరు-నవంబర్లలో పంట దిగుబడి కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ జులైలో వర్షాల సీజన్‌తోపాటు, రవాణాకు సంబంధించిన సవాళ్లు ధరల పెరుగుదలకు కారణమైనట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్రలోని నాసిక్‌ మార్కెట్‌కు త్వరలో కొత్త పంట రానుందని తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచీ టమాటా అందుబాటులోకి రానున్నట్లు అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు టమాటా బాగానే వస్తోంది. మరోవైపు కొన్నిచోట్ల కిలో టమాటా రూ.200 పలుకుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పంట దిగుబడి, రవాణాలో అంతరాయం కారణంగా టమాటా ధర రికార్డు స్థాయిలో నమోదవుతోంది. దేశవ్యాప్త సగటు ధర రూ.111.71 గా ఉంది. పంజాబ్‌లోని బఠిండాలో అత్యధికంగా కేజీ ధర రూ.203 పలుకుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని