అమ్మకాలిక్కడ... ఆదాయం అక్కడ!

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ప్రజలకు విక్రయాలు చేస్తున్న వాణిజ్య సంస్థలు చెల్లిస్తున్న సమగ్ర వస్తు, సేవల పన్ను(ఐజీఎస్టీ) రాష్ట్రానికి సక్రమంగా రావడం లేదు.

Updated : 13 Jul 2023 06:16 IST

రాష్ట్రానికి దక్కని ఐజీఎస్టీ సొమ్ము
ఇతర రాష్ట్రాల ఖాతాలో రూ.200 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌ : ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ప్రజలకు విక్రయాలు చేస్తున్న వాణిజ్య సంస్థలు చెల్లిస్తున్న సమగ్ర వస్తు, సేవల పన్ను(ఐజీఎస్టీ) రాష్ట్రానికి సక్రమంగా రావడం లేదు. పలు సంస్థలు చిరునామాలు ఇతర రాష్ట్రాల పేరుతో నమోదు చేసి... ఇక్కడ వ్యాపారం చేస్తున్నందున ఈ పరిస్థితి ఉన్నట్లు రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ గుర్తించింది. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన రూ.200 కోట్లకు పైగా ఐజీఎస్టీటీ ఇతర రాష్ట్రాల ఖాతాలకు చేరినట్లు తేలింది. దీనిని తెలంగాణకు ఇప్పించడంతో పాటు, ఇకపై ఇలా దారిమళ్లకుండా ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మార్పులు చేయాలని కేంద్ర ఆర్థికశాఖను తాజాగా రాష్ట్రప్రభుత్వం కోరింది. ప్రధానంగా సేవల రంగంలో ఐజీఎస్టీ రాష్ట్రానికి సరిగా రావడం లేదు. ఇతర రాష్ట్రాలు కేంద్రంగా పనిచేస్తున్న పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా తెలంగాణ ప్రజలకు సేవలందించినా పన్ను మాత్రం తెలంగాణ పేరుతో కట్టడం లేదని తనిఖీల్లో గుర్తించారు. ఉదాహరణకు మహారాష్ట్ర నుంచి దేశమంతా సేవలందిస్తున్న ‘ఐసీఐసీఐ లిమిటెడ్‌’ తెలంగాణకు చెల్లించాల్సిన రూ.82.38 కోట్లను కట్టలేదని కేంద్రానికిచ్చిన నివేదికలో రాష్ట్రప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ చెల్లింపు బిల్లు (ఇన్‌వాయిస్‌) వివరాల్లో నమోదు నిబంధనలను మార్చాలని సైతం కేంద్రానికి తెలంగాణ సూచించింది. ప్రస్తుతం ఐజీఎస్టీ ద్వారా తెలంగాణకు నెలకు రూ.1800 కోట్ల దాకా ఆదాయం వస్తోంది. చెల్లింపుల విధానంలో మార్పులు చేస్తే నెలకు వచ్చే ఆదాయం రూ.2 వేల కోట్లు దాటవచ్చని అధికార వర్గాల అంచనా.  

వ్యాపార సంస్థలు విక్రయాలు జరిపినప్పుడు ఆన్‌లైన్‌లో వినియోగదారుల చిరునామా ఏ రాష్ట్రం పేరుతో ఇస్తే అక్కడకు ఐజీఎస్టీ సొమ్ము వెళుతోంది. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి సేవలందించే పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు తాము విక్రయాలు జరిపే లేదా సేవలందించే రాష్ట్రం ‘ఏపీ’ అని చిరుమానాలో నమోదుచేశాయి. రాష్ట్రం విడిపోయి తొమ్మిదేళ్లయినా ఇంకా అవి ఐజీఎస్టీ చెల్లింపుల్లో ఏపీ అనే నమోదుచేస్తున్నందున ఐజీఎస్టీలో తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా సైతం అటు వెళుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో తేలింది. తెలంగాణ, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ వంటి రాష్ట్రాలతో పాటు లద్దాఖ్‌ సైతం ఐజీఎస్టీ చెల్లింపులు నష్టపోతున్నట్లు చెబుతున్నాయి. దీనిపై కేంద్ర జీఎస్టీ ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో ఈ కమిటీ సమావేశమై ఏ రాష్ట్రానికి వెళ్లాల్సిన ఐజీఎస్టీ సొమ్ము దానికే చేరేలా ఆన్‌లైన్‌లో మార్పులు చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని