నెలల్లోకొచ్చేశాం.. ఎన్నికలకు సిద్ధం కండి

‘నెలల్లోకి వచ్చేశాం... 8, 9 నెలల్లో ఎన్నికలుంటాయి. మీ జిల్లాల బాధ్యత మీదే. జగనన్న సురక్ష చాలా బాగా జరుగుతోంది. దీంతో మంచి మైలేజీ వస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనేలా చూడండి. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మిగిలిపోయిన ఇళ్లకూ తిరగండి’ అని మంత్రుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు.

Updated : 13 Jul 2023 07:34 IST

మంత్రులకు సీఎం ఆదేశం
కేబినెట్‌ విషయాలు బయటకెలా వెళ్తున్నాయంటూ అసహనం

ఈనాడు, అమరావతి: ‘నెలల్లోకి వచ్చేశాం... 8, 9 నెలల్లో ఎన్నికలుంటాయి. మీ జిల్లాల బాధ్యత మీదే. జగనన్న సురక్ష చాలా బాగా జరుగుతోంది. దీంతో మంచి మైలేజీ వస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనేలా చూడండి. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మిగిలిపోయిన ఇళ్లకూ తిరగండి’ అని మంత్రుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో... అధికారులు బయటకు వెళ్లాక సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

‘ప్రజలకు మరింత చేరువ కావాలి. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కనిపించాలి. జగనన్న సురక్షలో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో మండలస్థాయి అధికారుల బృందాలు నిర్వహిస్తున్న క్యాంపుల్లో మంత్రులు పాల్గొనాలి. అక్కడకు వస్తున్న జనంతో మాట్లాడాలి. ఎమ్మెల్యేలంతా భాగస్వాములయ్యేలా మీరే(మంత్రులు) చూడాలి. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో మీ భాగస్వామ్యం ఉండాలి. పార్టీలను చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలి’ అంటూ సుదీర్ఘంగా జగన్‌ హితబోధ చేశారు. ‘మంత్రివర్గ సమావేశ చర్చ వివరాలు బయటకు వెళుతున్నాయి. అలా బయటకు ఎలా చెబుతారు?’ అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అరగంటపాటు చర్చ జరిగినట్లు తెలిసింది. కేబినెట్‌ భేటీ అనంతరం బయటకొచ్చాక ఎక్కువ మంది మంత్రులు బయట ఎవరితోనూ మాట్లాడకుండా వేగంగా వెళ్లిపోయారు. ‘జగనన్న సురక్షలో పాల్గొనాలి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా తిరగాలి.. ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే బయట చెప్పమన్నారు’ అనే మాటలనే ఎక్కువ మంది మంత్రులు చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు