కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

Updated : 13 Jul 2023 06:08 IST

త్వరలో బృహత్‌ ప్రణాళిక ముసాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల స్వయంగా ఆలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అక్కడే నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆలయ అభివృద్ధికి రూ.అయిదారు వందల కోట్లైనా ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) రూపకల్పన బాధ్యతను.. యాదాద్రి ఆలయం మాస్టర్‌ప్లాన్‌ రూపొందించిన నిపుణులకే ప్రభుత్వం అప్పగించింది. దీంతోపాటు అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే యాదాద్రి, వేములవాడ ఆలయాలకు అభివృద్ధి అథారిటీలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో కొండగట్టు ఆలయ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అలానే మాస్టర్‌ పాన్‌ ముసాయిదాను ఈ నెల చివరి వారంలోగా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు చెప్పారు. ఆ ప్రతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపించి.. మార్పులు, చేర్పులతో ఆగస్టు చివరి నాటికి తుది మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులకు అయ్యే బడ్జెట్‌ అంచనాలను సైతం సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు