Tirumala: ప్రజాసేవ చేసే శక్తిని ఇవ్వాలని.. ఆ దేవదేవుడిని ప్రార్థించా: గడ్కరీ

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు.

Published : 13 Jul 2023 07:35 IST

తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు గడ్కరీ దంపతులకు వేదాశీర్వచనం పలికారు. కేంద్రమంత్రికి ఛైర్మన్ సుబ్బారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో గడ్కరీ మాట్లాడారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించామని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు.

సర్వ దర్శనానికి 24 గంటలు

మరోవైపు, శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనానికి మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం మొత్తంగా 72,664 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని