Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 06 May 2023 21:00 IST

1. తెలంగాణలో మ్యూజిక్‌ యూనివర్సిటీ ఏర్పాటు: మంత్రి కేటీఆర్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్యే కాకుండా సంగీత విద్య కూడా ప్రాధాన్యంగా ఉండాలన్న కేటీఆర్... రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గ్రూప్‌-4 అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్: టీఎస్‌పీఎస్సీ

గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఈనెల 9 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు మరోసారి అవకాశం ఉండదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చెన్నై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. ముంబయిపై విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించింది. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత చెన్నై బౌలర్లు అదరగొట్టడంతో ముంబయి 139/8కే పరిమితమైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. TTEలకు బాడీ కెమెరాలు.. పైలట్‌ ప్రాజెక్ట్‌ షురూ!

భారతీయ రైల్వే (Indian Railways) మరో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. టికెట్‌ తనిఖీల్లో పారదర్శకత, రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు గానూ టికెట్‌ తనిఖీ అధికారులకు (TTE) బాడీ కెమెరాలు అమర్చనుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ముంబయి డివిజన్‌లో 50 బాడీ కెమెరాలను (Body Cameras) సిద్ధం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నివురుగప్పిన నిప్పులా మణిపుర్.. అల్లర్లకు 54 మంది బలి

ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌(Manipur)లో పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. భద్రతా సిబ్బంది పహారాలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. శనివారం ఉదయం మార్కెట్లు, దుకాణాలు తెరిచినప్పటికీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 54కు చేరిందని అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కర్ణాటకలో కాంగ్రెస్‌కి 141 సీట్లు పక్కా: అసెంబ్లీ ఎన్నికలపై డీకేఎస్‌ జోస్యం

కర్ణాటక (Karnataka)లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికారం చేజిక్కించుకునేందుకు ఆయా పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) 141 సీట్లను గెలుచుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంటున్నట్లు వస్తున్న పుకార్లను ఆయన తోసి పుచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఘనంగా కింగ్ ఛార్లెస్‌ పట్టాభిషేకం.. కిరీటాన్ని ధరించిన బ్రిటన్‌ రాజు

బ్రిటిష్‌ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌..  సంప్రదాయాలను అనుసరించి కిరీటాన్ని ధరించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో శనివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో కింగ్‌ ఛార్లెస్‌-3 సింహాసనాన్ని అధిష్ఠించగా.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కింగ్‌ ఛార్లెస్‌కు మళ్లీ పట్టాభిషేకం..సిద్ధమవుతున్న ఆదివాసీలు!

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో కింగ్ ఛార్లెస్‌-3 పట్టాభిషేకం వైభవంగా జరిగింది. 2 వేలకు మందికిపైగా అతిథులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో కింగ్‌ ఛార్లెస్‌-3 సింహాసనాన్ని అధిష్ఠించారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని తిలకించింది. అయితే, దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో టన్నా ద్వీపంలోని వనౌత్‌ ద్వీపానికి చెందిన రెండు గ్రామాలకు చెందిన ఆదివాసీలు కూడా ఛార్లెస్‌-3 పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అప్పుడు క్వీన్‌ ఎలిజబెత్‌కు.. ఇప్పుడు కింగ్‌ ఛార్లెస్‌కి.. వెన్నంటే ఉంటూ..!

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌లో (Britain) పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కింగ్‌ ఛార్లెస్‌-3 బ్రిటన్‌తో పాటు మరో 14 రాజ్యాలకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2 గత ఏడాది సెప్టెంబరులో కన్నుమూసిన తర్వాత వేలాది మంది ప్రజలు, విదేశాలకు చెందిన అతిథుల నడుమ ఈ పట్టాభిషేకం కనులవిందుగా సాగింది. ఈ సందర్భంగా కింగ్‌ ఛార్లెస్‌ బాడీగార్డుపై మరోసారి ఇంటర్నెట్‌లో చర్చ మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నైతో మ్యాచ్‌.. రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలో (IPL) ముంబయి ఇండియన్స్‌ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన ఖాతాలో మాత్రం చెత్త రికార్డును వేసుకున్నాడు. ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో చెపాక్‌ వేదికగా చెన్నైతో  జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడో బంతికే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ల్యాప్‌ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న జడేజా చేతికి చిక్కాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని