TTEలకు బాడీ కెమెరాలు.. పైలట్‌ ప్రాజెక్ట్‌ షురూ!

Indian Railways: టికెట్ల తనిఖీలో పారదర్శకత కోసం టీటీఈలకు బాడీ కెమెరాలను అమర్చే పైలట్‌ ప్రాజెక్ట్‌ విధానంలో అమల్లోకి వచ్చింది.

Published : 06 May 2023 19:15 IST

ముంబయి: భారతీయ రైల్వే (Indian Railways) మరో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. టికెట్‌ తనిఖీల్లో పారదర్శకత, రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు గానూ టికెట్‌ తనిఖీ అధికారులకు (TTE) బాడీ కెమెరాలు అమర్చనుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ముంబయి డివిజన్‌లో 50 బాడీ కెమెరాలను (Body Cameras) సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం అయితే దేశమంతటా విస్తరించే అవకాశం ఉంది.

బాడీ కెమెరాల వినియోగాన్ని 2005లో యూకే పోలీసులు ప్రారంభించారు. తర్వాతి కాలంలో భారత్‌ సహా చాలా దేశాల్లో శాంతి భద్రత విభాగంలో పనిచేసేవారు వీటిని వాడడం మొదలుపెట్టారు. తాజాగా రైళ్లలోనూ వీటిని వినియోగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కొక్కటీ రూ.9 వేలు విలువ చేసే 50 బాడీ కెమెరాలను కొనుగోలు చేసింది. ఈ కెమెరాలు 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలవు. ముంబయి డివిజన్‌లో విజయవంతం అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు.

టీటీఈలకు బాడీ కెమెరాలు అమర్చడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల సెంట్రల్‌ రైల్వే పరిధిలో ఓ మహిళా పాసింజర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఓ టీటీఈ సస్పెండ్‌ అయ్యారు. కొన్నిసార్లు రైల్వే ప్రయాణికులు సైతం వీరంగం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తుంటాయి. బాడీ కెమెరాల ద్వారా ఈ తరహా ఘటనలు నివారించొచ్చని అధికారులు అంటున్నారు. టికెట్ల తనిఖీలో పాదర్శకత తీసుకురావడంతో పాటు తనిఖీ అధికారుల్లో జవాబుదారీతనం, వృత్తినైపుణ్యాలు మెరుగవుతాయని చెప్తున్నారు. దీంతో పాటు రైళ్లలో జరిమానా పడిన సందర్భాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానాన్నీ సెంట్రల్‌ రైల్వే ఇటీవల ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని