Manipur Violence: నివురుగప్పిన నిప్పులా మణిపుర్.. అల్లర్లకు 54 మంది బలి

Manipur Violence:రెండురోజులుగా ఘర్షణలతో  అల్లకల్లోలంగా మారిన మణిపుర్‌లో మృతుల సంఖ్య 54కు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కాస్త కుదుటపడినట్లు కనిపిస్తోంది.  

Updated : 06 May 2023 17:17 IST

ఇంఫాల్‌: ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌(Manipur)లో పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. భద్రతా సిబ్బంది పహారాలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. శనివారం ఉదయం మార్కెట్లు, దుకాణాలు తెరిచినప్పటికీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 54కు చేరిందని అధికారులు వెల్లడించారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ 54 మృతదేహాలను చురాచాంద్‌పుర్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లా, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లోని మార్చురీల్లో భద్రపరిచారు. జాతుల మధ్య నెలకొన్న ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని, అధికారులు ఆ సంఖ్యను బయటకు చెప్పడానికి సుముఖంగా లేరని సమాచారం. (Manipur Violence)

మరోపక్క శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కొండ ప్రాంతానికి చెందిన  ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఇండియన్ రిజర్వ్‌ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ హింసాత్మక ఘర్షణలకు కేంద్రప్రాంతమైన చురాచాంద్‌పుర్, మోరే, కాక్‌చింగ్, కాంగ్‌పోక్పీ జిల్లాలు పూర్తిగా ఆర్మీ నియంత్రణలో ఉన్నాయి.  అల్లర్లతో బుధవారం నుంచి ఉద్రిక్తంగా మారిన మణిపుర్‌లో 10 వేల మంది భద్రతా బలగాలను మోహరించారు. అలాగే ఇప్పటివరకు 13వేల మందిని శిబిరాలకు తరలించినట్లు రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. మణిపుర్‌(Manipur)లో పరీక్షా కేంద్రాలను కేటాయించిన అభ్యర్థులకు నీట్‌ యూజీ-2023(NEET (UG)-2023 ) పరీక్ష వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఆ పరీక్షకు మరో తేదీ ప్రకటించనున్నారు. మణిపుర్‌లో ఉన్న తమ రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు పొరుగురాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని