DK shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్‌కి 141 సీట్లు పక్కా: అసెంబ్లీ ఎన్నికలపై డీకేఎస్‌ జోస్యం

కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 141 సీట్లను గెలుచుకుంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Published : 06 May 2023 17:33 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికారం చేజిక్కించుకునేందుకు ఆయా పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) 141 సీట్లను గెలుచుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK shivakumar) ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంటున్నట్లు వస్తున్న పుకార్లను ఆయన తోసి పుచ్చారు. శనివారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలుపొందితే ముఖ్యమంత్రిగా ఎవరు నియామకమైనా.. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని తెలిపారు.

‘1978లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించినట్లుగానే ఈ సారి భారీ మెజార్టీతో గెలుపొందుతుంది. ప్రధాని మోదీ (PM Modi) రాష్ట్రంలో ప్రచారం చేసినా సరే.. ప్రజల మద్దతు మాత్రం కాంగ్రెస్‌కే ఉంది.  పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. కొన్నేళ్ల నుంచి పార్టీ నాయకులు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. కానీ.. భాజపా (BJP)మాత్రం సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బజరంగ్‌ దళ్‌, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధిస్తాం. మోదీ సర్కారు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది.  ద్రవ్యోల్బణం, నిత్యవసరాల ధరలు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే వారికి ఉపశమనం కల్పించటంలో విఫలమైంది. కాంగ్రెస్‌ రాష్ట్ర అభివృద్ధి కోసమే పోరాడుతోంది. భాజపాకు రాష్ట్ర సమస్యలపై దృష్టి లేదు. ఈసారి కాంగ్రెస్‌ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుంది’అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని