Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Dec 2023 21:11 IST

1. APPSC: ఏపీలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. నూతన సిలబస్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ(APPSC) స్పష్టం చేసింది. మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో 331  ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. janasena: ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను: పవన్‌

జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్‌.రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్‌ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. EC: లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఈసీ

లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం ఈనెల 20 నుంచి జనవరి 5 వరకు కేంద్రం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)కు మరో షాక్‌ తగిలేలా ఉంది. మొదటి రెండు సీజన్లలో జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్య ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌కు ట్రేడ్‌ కాగా.. ఇప్పుడు మరో కీలక ఆటగాడు ఫ్రాంఛైజీ మారే అవకాశముందని తెలుస్తోంది. గుజరాత్ జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్న మహ్మద్‌ షమి (Mohammed Shami)ని ట్రేడింగ్‌ కోసం ఓ ఫ్రాంఛైజీ సంప్రదించిందట. ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ టైటాన్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కల్నల్ అర్విందర్‌ సింగ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Meftal: ఈ పెయిన్‌ కిల్లర్‌తో జాగ్రత్త : అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం!

ఓ పెయిన్‌ కిల్లర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డ్రగ్‌ సేఫ్టీ అలెర్ట్‌ను జారీ చేసింది. నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్‌ (Meftal) ఔషధం ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించాలని ఆరోగ్యరంగ నిపుణులు, రోగులకు సూచించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని భారత ఔషధ ప్రమాణాలను నిర్దేశించే కమిషన్‌ (IPC) తాజా అడ్వైజరీ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Congress: ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తాం: వి.హన్మంతరావు

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Sugar: చక్కెర ధరల అదుపునకు కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను (Sugar prices) అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌ (ethanol) ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా కేంద్రం నిలువరించింది. ఈ మేరకు చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను పెరగకుండా చూడాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ చక్కెర మిల్లులకు, డిస్టిలరీలకు గురువారం లేఖ రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. UN Chief: ఆ విపత్తును అడ్డుకోండి.. అసాధారణ అధికారాన్ని వినియోగించిన ఐరాస చీఫ్‌!

గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తోన్న ప్రతిదాడుల్లో (Israel Hamas Conflict) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16వేలు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసాధారణ అధికారాలను వినియోగించేందుకు సిద్ధమైంది. గాజాలో మానవతా సంక్షోభ నివారణకు భద్రతా మండలి (Security Council) చర్యలు చేపట్టాలని కోరుతూ యూఎన్‌ ఛార్టర్‌లోని ఆర్టికల్‌ 99ను వినియోగించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. I.N.D.I.A: త్వరలోనే ‘ఇండియా’ కూటమి భేటీ.. ప్రధాన అజెండా ఇదే!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు త్వరలోనే భేటీ కానున్నారు. ఈ కీలక భేటీ డిసెంబర్‌ 17, 20 తేదీల్లో ఉండే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. కూటమిలోని పార్టీల ముఖ్య నేతలు పాల్గొనే ఈ భేటీలో సీట్ల పంపకాలు అంశాన్ని ప్రధాన అజెండాగా చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌తో టాటా మోటార్స్‌ ఒప్పందం

టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహన వినియోగదారుల కోసం డిజిటల్‌ ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ను అందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గురువారం తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయని టాటా మోటార్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యం కింద టాటా మోటార్స్‌ కస్టమర్స్‌ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెహికల్‌ ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ను.. టాటా మోటార్స్‌ ఆన్‌లైన్‌ సేల్స్‌ ప్లాట్‌ఫాం, టాటా ఇ-గురు మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సులువుగా యాక్సెస్‌ చేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని