UN Chief: ఆ విపత్తును అడ్డుకోండి.. అసాధారణ అధికారాన్ని వినియోగించిన ఐరాస చీఫ్‌!

గాజాలో మానవతా సంక్షోభ నివారణకు భద్రతా మండలి (Security Council) చర్యలు చేపట్టాలని కోరుతూ యూఎన్‌ చార్టర్‌లోని ఆర్టికల్‌ 99ను వినియోగించాలని నిర్ణయించింది.

Published : 07 Dec 2023 20:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తోన్న ప్రతిదాడుల్లో (Israel Hamas Conflict) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16వేలు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసాధారణ అధికారాలను వినియోగించేందుకు సిద్ధమైంది. గాజాలో మానవతా సంక్షోభ నివారణకు భద్రతా మండలి (Security Council) చర్యలు చేపట్టాలని కోరుతూ యూఎన్‌ ఛార్టర్‌లోని ఆర్టికల్‌ 99ను వినియోగించాలని నిర్ణయించింది. గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు దాడులు మరింత తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఐరాస చీఫ్‌ (Antonio Guterres) ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘ఐరాస చీఫ్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్‌ 99ను అమలు చేస్తున్నా. గాజాలో మానవతా వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం నెలకొన్న వేళ.. ఆ విపత్తును నివారించడానికి భద్రతా మండలి సహాయం చేయాలని కోరుతున్నా. దీంతోపాటు మానవతావాద కాల్పుల విరమణను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ పేర్కొన్నారు.

ఏమిటీ ఆర్టికల్‌ 99?

ఐరాసలోని ఆర్టికల్‌ 99 అనేది సెక్రటరీ జనరల్‌ చేతిలో ఉన్న స్వతంత్ర సాధనంగా పేర్కొంటారు. దీని ప్రకారం, ప్రపంచ శాంతి, భద్రతా నిర్వహణకు ముప్పుగా పరిగణించే ఏ విషయాన్నైనా భద్రతా మండలి దృష్టికి ఐరాస చీఫ్‌ తీసుకెళ్లొచ్చు. ఈ ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశపరచవచ్చు. ఇజ్రాయెల్‌ భద్రతా దళాలు, హమాస్‌ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణపై శక్తివంతమైన భద్రతామండలి (UNSC) ఎటువంటి తీర్మానాలు ఆమోదించని నేపథ్యంలో ఐరాస చీఫ్‌ ఈ ఆర్టికల్‌ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఐరాస చీఫ్‌ సూచనలకు అనుగుణంగా కాల్పుల విరమణ చేయాలంటూ ఉభయ పక్షాలను కోరుతూ భద్రతా మండలి ఏదైనా తీర్మానాన్ని ఆమోదిస్తే.. ఆ ప్రాంతంలో శాంతిస్థాపనకు వివిధ మార్గాలను అనుసరిస్తారు. అంతర్జాతీయ బలగాలను మోహరించడం, ఒకటి లేదా రెండు పక్షాలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇదిలాఉంటే, గాజాలో ఉన్న హమాస్‌ బెటాలియన్‌ కమాండర్లలో సగానికిపైగా మృతిచెందారని ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) వెల్లడించింది. మొన్నటివరకు ఉత్తర గాజాలో భీకర దాడులు చేసిన ఐడీఎఫ్‌.. ప్రస్తుతం దక్షిణ గాజాలోనూ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో పాలస్తీనియన్లు తలదాచుకునేందుకు సురక్షిత చోటు లేకుండా పోయింది. ఇలా గాజాలో మానవతా పరిస్థితులు క్షీణిస్తుండటంపై ఐక్యరాజ్యసమితి చీఫ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తును అడ్డుకునేందుకు ఐరాస భద్రతా మండలి చర్యలు చేపట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని