Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 12 Jun 2023 20:59 IST

1. ధరణి వద్దనే వాళ్లకు ప్రజలే సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్‌

పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గద్వాల ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. గద్వాల జిల్లాలో అనేక మంచి పనులు చేసుకుంటున్నామని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు చదువులు చెప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ జిల్లాలోని ఇద్దరు మంత్రులు తెలంగాణ ఉద్యమకారులేనని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెదేపా చేసిన పనుల్లో 10శాతమైన వైకాపా చేసిందా?: లోకేశ్‌

రాయలసీమ ప్రజలను వైఎస్‌ జగన్‌ మోసం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. బద్వేల్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టయినా పూర్తి చేసిందా? రాయలసీమకు ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా? తెదేపా చేసిన పనుల్లో 10శాతమైనా వైకాపా ప్రభుత్వం చేసిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవు: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం వేల మంది రైతులకు భూములు పంచిపెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండల వ్యవస్థ వచ్చాక భూరికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూముల వివరాలను పారదర్శకంగా రికార్డు చేసిందని చెప్పారు. డిజిటలైజ్‌ చేసేందుకు భూభారతి పేరుతో పైలట్‌ ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేంటో దిల్లీ పెద్దలు చెప్పాలి: మంత్రి అమర్నాథ్‌

ఏ పార్టీపై ఆధారపడే పరిస్థితి వైకాపాకు లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌ షా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఒక్క మాటా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. పథకాలన్నీ ఎంతో దయతో కేంద్రం ఇస్తున్నట్లు అమిత్‌షా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రాల పన్నుల నుంచే పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోంది. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేంటో దిల్లీ పెద్దలు చెప్పాలి’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి స్వల్ప ఊరట

పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. కోర్టు హాజరు నుంచి మినహాయింపునిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబయి హైకోర్టు పొడిగించింది. ఆగస్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగానూ భాజపాకి చెందిన మహేశ్‌ శ్రీశ్రీమల్‌ 2021లో పరువునష్టం పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తుపానుపై అప్రమత్తంగా ఉండండి.. ప్రజలను తరలించండి: ప్రధాని మోదీ

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాన్‌ అతితీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తుపాను పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొవిన్‌ పోర్టల్‌ సురక్షితం.. డేటా లీక్‌ను కొట్టిపారేసిన కేంద్రం

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాటుచేసిన కొవిన్‌ పోర్టల్‌లోని (Co-WIN portal) సున్నితమైన సమాచారం లీకైందంటూ వచ్చిన వార్తలపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్‌ పోర్టల్‌ పూర్తి సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. డేటా లీక్‌ అయ్యిందని వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇటలీ మాజీ పీఎం బెర్లుస్కొనీ మృతి.. ఎక్కువ కాలం పాలించిన నేత!

ఇటలీ (Italy) మాజీ ప్రధాన మంత్రి సిల్వియో బెర్లుస్కొనీ (Silvio Berlusconi) కన్నుమూశారు. కొన్నేళ్లుగా లూకేమియాతో బాధపడుతోన్న ఆయన.. చికిత్స కోసం శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే 86 ఏళ్ల వయసులో సోమవారం తుదిశ్వాస విడిచినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఆయన గతంలో కొవిడ్‌తోపాటు గుండె జబ్బులు, ప్రొస్టేట్ క్యాన్సర్‌తోనూ బాధపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మోదీపై అమిత్ షా కోపంగా ఉన్నారా?: స్టాలిన్‌

తమిళనాడు (Tamil nadu) పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తమిళ ప్రధాని ఉండాలంటూ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్‌.. ‘‘ప్రధాని మోదీ (PM Modi)పై అమిత్ షాకు ఎందుకంత కోపం?’’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. దిల్లీలో బైక్‌ టాక్సీలకు మళ్లీ బ్రేక్‌!.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

బైక్‌ టాక్సీలను అనుమతిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు (Bike Taxi) నిలుపుదల చేసింది. కొత్త విధానం రూపొందించేంత వరకు రాపిడో (Rapido), ఉబర్‌ (Uber) వంటి సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. టాక్సీలపై జులై చివరి నాటికి కొత్త విధానంతో ముందుకు వస్తామని దిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని