Stalin: మోదీపై అమిత్ షా కోపంగా ఉన్నారా?: స్టాలిన్‌

ప్రధాని మోదీ (PM Modi)పై అమిత్ షా (Amit shah)కు కోపం వచ్చినట్లుందని అంటున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌. తమిళ పీఎం రావాలని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించారిలా..!

Published : 13 Jun 2023 01:54 IST

చెన్నై: తమిళనాడు (Tamil nadu) పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తమిళ ప్రధాని ఉండాలంటూ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్‌.. ‘‘ప్రధాని మోదీ (PM Modi)పై అమిత్ షాకు ఎందుకంత కోపం?’’ అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..

ఆదివారం తమిళనాడులో పర్యటించిన అమిత్ షా (Amit shah).. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు తమిళ రాష్ట్రానికి చెందిన ఎవరికీ ప్రధాని అయ్యే అవకాశం రాకపోవడం విచారకరం. భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఓ ప్రధాని (Tamilian PM) రావాలని కోరుకుంటున్నా. ఇందుకోసం కార్యకర్తలంతా గట్టిగా కృషి చేయాలి’’ అని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్‌ (Stalin) సోమవారం స్పందించారు. ‘‘అమిత్ షా సలహాను నేను స్వాగతిస్తున్నా. అయితే, ఆయనకు ప్రధాని మోదీపై ఎందుకు కోపమొచ్చిందో..?’’ అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘ఒకవేళ తమిళ వ్యక్తిని ప్రధానిని చేయాలనుకుంటే.. తమిళిసై సౌందరరాజన్‌ (తెలంగాణ గవర్నర్), ఎల్‌. మురుగన్‌ (కేంద్రమంత్రి) వంటివారున్నారు. ప్రధాని అభ్యర్థులుగా వారికి అవకాశాలు రావొచ్చు’’ అని స్టాలిన్‌ వివరించారు.

ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా (Amit shah) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 25 నియోజకవర్గాల్లో సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కాషాయ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక, వెల్లూరులో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, డీఎంకేపై విమర్శల వర్షం కురిపించారు. ఆ పార్టీలు వారసత్వ రాజకీయాలు, అవినీతికి పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని