CM kcr: ధరణి వద్దనే వాళ్లకు ప్రజలే సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్‌

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గద్వాల ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.

Updated : 12 Jun 2023 21:14 IST

గద్వాల: పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గద్వాల ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. గద్వాల జిల్లాలో అనేక మంచి పనులు చేసుకుంటున్నామని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు చదువులు చెప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ జిల్లాలోని ఇద్దరు మంత్రులు తెలంగాణ ఉద్యమకారులేనని చెప్పారు. పాలమూరులో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు దొరికేదని.. ఇప్పుడు మిషన్‌ భగీరథతో ఇంటి వద్దకే తాగునీరు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు.

ఎంత తేడా ఉందో మీరే గమనించండి..

‘గతంలో పాలమూరు నుంచి వలస వెళ్లేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు తరలివస్తున్నారు. మీకు కరెంటు రాదు.. తెలంగాణ చీకటిమయం అవుతుందని కొందరు మాట్లాడారు. ఇక్కడకు ఆంధ్ర కేవలం 25కి.మీ. దూరమే ఉంది. ఇక్కడికి ఏపీకి ఎంత తేడా ఉందో మీరే గమనించండి. గద్వాల జిల్లాలో ఇప్పటివరకు ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 మండలాలు, 4 మున్సిపాలిటీలున్నాయి. నేను ఇక్కడికి తొలిసారి వచ్చాను. అందుకోసం అభివృద్ధి చేసుకొనేందుకు ప్రతి గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు, మండల కేంద్రాలకు రూ.15 లక్షలు గ్రాంటు, గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.50 కోట్ల గ్రాంటు మంజూరు చేస్తున్నా. 

ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తారంట..

ఏనాడూ ప్రజల గురించి ఆలోచించని కొందరు వ్యక్తులు ధరణిని తీసేస్తామని.. బంగాళాఖాతంలో కలిపేస్తామని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ధరణి కారణంగా రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. అనుకోకుండా ఒక రైతు మరణిస్తే బీమా సొమ్ము రూ.5లక్షలు పది రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. మూడేళ్లు ఎంతో కష్టపడి ధరణిని తీసుకొస్తే.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ధరణిని బంగాళాఖాతంలో వేయడమా.. లేదా ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా? ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ధరణి కావాలంటున్నారు. కొన్ని పార్టీలు వద్దంటున్నాయి. ధరణి ఉండాలా..వద్దా..? మీరే చెప్పండి. ధరణి వద్దనే వాళ్లకు మీరే సమాధానం చెప్పాలి. 24 గంటల నిరంతర విద్యుత్‌, రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ భారాసనే గెలిపించాలి.

మన పద్ధతిలో ఎంతో పురోగతి సాధించాం..

అంతకుముందు గద్వాల సమీకృత కలెక్టర్‌ భవన ప్రారంభోత్సవంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్‌, తాగు నీరు, ఓడీఎఫ్‌.. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ తన సత్తా చాటి మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మన పద్ధతిలో ఎంతో పురోగతి సాధించాం. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. రానున్న పదేళ్లు కూడా ఇలాగే కష్టపడితే తెలంగాణకు పోటీ ఎవరూ ఇవ్వలేరు. హరిత క్రాంతి సాధించిన తొలి రాష్ట్రం పంజాబ్‌. గత 50 ఏళ్లుగా వరి ధాన్యం ఉత్పత్తిలో వారిదే రికార్డు. ఇవాళ పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఇదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలి. ప్రజల సహకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు