Silvio Berlusconi: ఇటలీ మాజీ పీఎం బెర్లుస్కొనీ మృతి.. ఎక్కువ కాలం పాలించిన నేత!

ఇటలీ మాజీ ప్రధాని, వివాదాస్పద నేత సిల్వియో బెర్లుస్కోనీ (Silvio Berlusconi) మృతి చెందారు. కొన్నేళ్లుగా లూకేమియాతో బాధపడుతోన్న ఆయన తన 86 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూసినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.

Updated : 12 Jun 2023 17:31 IST

రోమ్‌: ఇటలీ (Italy) మాజీ ప్రధాన మంత్రి సిల్వియో బెర్లుస్కొనీ (Silvio Berlusconi) కన్నుమూశారు. కొన్నేళ్లుగా లూకేమియాతో బాధపడుతోన్న ఆయన.. చికిత్స కోసం శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే 86 ఏళ్ల వయసులో సోమవారం తుదిశ్వాస విడిచినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఆయన గతంలో కొవిడ్‌తోపాటు గుండె జబ్బులు, ప్రొస్టేట్ క్యాన్సర్‌తోనూ బాధపడ్డారు.

ఇటలీకి నాలుగు సార్లు ప్రధానిగా పని చేసిన బెర్లుస్కొనీ.. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా గుర్తింపు పొందారు. స్థానికంగా తిరుగులేని మీడియా అధినేతగా ఎదిగిన ఆయన.. ప్రస్తుతం దేశంలో మూడో సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఆయన జీవితం అనేక వివాదాస్పద అంశాలతో ముడిపడి ఉంది. విలాసాలతోపాటు అనేక లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులు ఎదుర్కొన్నారు.

బెర్లుస్కొనీ 1936లో ఇటలీలోని మిలాన్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. న్యాయపట్టా అందుకున్నారు. ఒకప్పుడు క్రూజ్ షిప్‌లో గాయకుడైన ఆయన.. నిర్మాణ రంగం, ఆపై మీడియా రంగంలో ప్రవేశించి కుబేరుడిగా ఎదిగారు. 1994లో ‘ఫోర్జా ఇటాలియా’ పార్టీని స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టారు. అదే ఏడాది మొదటిసారి ప్రధానిగా అధికారం చేపట్టారు.

ఫోర్జా ఇటాలియా పార్టీ.. ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోనీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో బెర్లుస్కొనీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల 86వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపి, వోడ్కా కూడా పంపారు. ప్రతిగా బెర్లుస్కొనీ ఆయనకు ఇటాలియన్ వైన్‌ బహుమతిగా పంపించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని