Bike Taxi: దిల్లీలో బైక్‌ టాక్సీలకు మళ్లీ బ్రేక్‌!.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

కొత్త విధానం రూపొందించేంత వరకు రాపిడో, ఉబర్‌ వంటి సంస్థలపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

Published : 12 Jun 2023 20:29 IST

దిల్లీ: బైక్‌ టాక్సీలను అనుమతిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు (Bike Taxi) నిలుపుదల చేసింది. కొత్త విధానం రూపొందించేంత వరకు రాపిడో (Rapido), ఉబర్‌ (Uber) వంటి సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. టాక్సీలపై జులై చివరి నాటికి కొత్త విధానంతో ముందుకు వస్తామని దిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దీంతో దిల్లీలో బైక్‌ టాక్సీలకు మళ్లీ బ్రేక్‌ పడినట్లయ్యింది.

కొత్త విధానం వచ్చేంతవరకు క్యాబ్‌ అగ్రిగేటర్లపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ దిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు వేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను గతవారం సుప్రీంకోర్టు కోరింది. తాజాగా ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం.. దిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

బైక్‌ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్‌, ర్యాపిడోలను దిల్లీ ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నాన్‌-ట్రాన్స్‌పోర్ట్‌ కేటగిరీకి చెందిన వాహనాలను ట్యాక్సీల కోసం వినియోగిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వీటిని సవాలు చేస్తూ క్యాబ్‌ అగ్రిగేటర్లు తొలుత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు