CoWin: కొవిన్‌ పోర్టల్‌ సురక్షితం.. డేటా లీక్‌ను కొట్టిపారేసిన కేంద్రం

Data Leak Co-WIN portal: కొవిన్‌ పోర్టల్‌లో డేటా లీక్‌ అయ్యిందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ పోర్టల్‌లో సమాచారం అత్యంత గోప్యంగా ఉందని స్పష్టం చేసింది.

Updated : 12 Jun 2023 17:56 IST

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాటుచేసిన కొవిన్‌ పోర్టల్‌లోని (Co-WIN portal) సున్నితమైన సమాచారం లీకైందంటూ వచ్చిన వార్తలపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్‌ పోర్టల్‌ పూర్తి సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. డేటా లీక్‌ అయ్యిందని వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని పేర్కొంది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్‌టీ (CERT)ని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. (Data Leak Co-WIN portal)

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ (CoWIN) పేరిట ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తులు టీకా తీసుకున్నారు. ఒకే ఫోన్‌ నంబర్‌తో కుటుంబంలోని పలువురు టీకాలు వేయించుకున్నారు కూడా. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్‌ వేసుకున్నారు? వంటి సమాచారం ఉంటుంది. అయితే, ఈ సమాచారం లీక్‌ అయ్యిందంటూ తాజాగా వార్తలు వచ్చాయి. టెలిగ్రామ్‌లోని ఓ బాట్‌లో (bot) వ్యక్తుల ఫోన్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబరు ఎంటర్‌ చేస్తే వారి సమస్త సమాచారం వెలుగుచూస్తోందనేది దాని సారాంశం. వ్యక్తుల డేటా ఇలా బయటకు వచ్చిందన్న సమాచారం అనంతరం చాట్‌బాట్‌ నిలిచిపోయిందని తెలిసింది. లీకైన డేటాలో పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు, రాజకీయ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ డేటా లీక్‌ (Data Leak)పై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పందిస్తూ డేటా లీక్‌ వార్తలను తీవ్రంగా ఖండించింది. ‘‘ఇవన్నీ నిరాధార వార్తలు. కొవిన్ పోర్టల్‌ పూర్తిగా భద్రమైనది. ఇందులోని డేటాను గోప్యంగా ఉంచేందుకు వెబ్‌ అప్లికేషన్‌ ఫైర్‌వాల్‌, యాంటీ-డీడీఓఎస్‌, SSL/TLS, రెగ్యులర్‌ వల్నరబిలిటీ అసెస్‌మెంట్, ఐడెంటిటీ అండ్‌ యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో దీన్ని రూపొందించాం. ఓటీపీ (OTP) అథెంటికేషన్‌తో మాత్రమే ఇందులోనే డేటాను చూడగలం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) తమ ప్రకటనలో వెల్లడించింది. ఓటీపీ లేకుండా కొవిన్‌ పోర్టల్‌ (Co-WIN portal)లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్‌ చేయలేమని కేంద్రం తెలిపింది. డేటా లీక్‌ వార్తలను తాము దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం(సీఈఆర్‌టీ)ను కేంద్రం కోరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని