Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 06 Dec 2021 21:35 IST

1.ధాన్యం కొనుగోళ్లకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలి: హైకోర్టు

వానాకాలం పంటను కొనుగోలు చేసేందుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 22వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని ప్రభుత్వ వివరణను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వానాకాలం పంట కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయ విద్యార్థి శ్రీకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది.

2.ఓటీఎస్‌ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్‌: బొత్స సత్యనారాయణ

పేదలకు సొంతింటిపై పూర్తి హక్కుల కల్పనే వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ముఖ్య ఉద్దేశం అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదల ఇళ్లకు ఎందుకని రిజిస్ట్రేషన్లు చేయలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఓటీఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

3.కలెక్టర్‌ ఆరోపణలన్నీ అసత్యం.. మాకున్నది 8.36 ఎకరాలే: ఈటల జమున

జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్‌ బలవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్‌ హరీశ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈటల సతీమణి జమున ఆరోపించారు. సోమవారం షామీర్‌పేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలలో ఈటెల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్ హరీశ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

4.కరోనా దెబ్బ.. ఎయిర్‌లైన్లకు రూ.19,564కోట్ల నష్టం

గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి దేశంలో దాదాపు అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. కొవిడ్‌ దెబ్బకు విమానయానరంగ పరిశ్రమ కూడా భారీగా కుదేలైంది. నిబంధనల పేరుతో విధించిన ఆంక్షలు.. గతేడాది విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు పెను నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కరోనా కారణంగా ఏడాది కాలంలో ఎయిర్‌లైన్లు దాదాపు రూ.20 వేలకోట్ల మేర నష్టాలను చవిచూశాయి.

5.భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో మరో రెండు కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎనిమిది కేసులు వెలుగుచూడగా.. ముంబయి మహా నగరంలో తాజాగా నమోదైన ఈ రెండు కేసులతో ఆ సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి ముంబయికి వచ్చిన మరో వ్యక్తి (36)లో ఒమిక్రాన్‌ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

పుష్పరాజ్‌ వచ్చేశాడు

6.తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం కావొచ్చు..!

కొవిడ్-19 కంటే భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చట. అందుకే కరోనా నేర్పించిన పాఠాలను వృథా కానీయకుండా, మరో విజృంభణకు ప్రపంచం సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. ఈ మాటలన్నది ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనికా టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్.

7.ఎట్‌-రిస్క్‌ దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) అధికారులు అప్రమత్తమయ్యారు. ఎట్‌ రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం ఇటీవల నూతన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

8.పంజాబ్‌లో గెలుపే లక్ష్యం.. ఆ 2 పార్టీలతో సర్దుబాటు: కెప్టెన్‌

మరికొన్ని నెలల్లో జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే తమ లక్ష్యమని మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో కలిసి నడిచిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం  ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

9.ఆరోగ్య బీమా ప్రీమియంపై GST.. కేంద్రం ఏమందంటే?

కొవిడ్‌-19 విజృంభణ వేళ.. ఆరోగ్య బీమా తీసుకోవడంపై ఎక్కువ మంది ప్రజలు దృష్టి పెడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు క్లెయింలు ఎక్కువ కావడంతో బీమా సంస్థలు ప్రీమియం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీమా ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (GST) 18శాతం చెల్లించాల్సి రావడం పట్ల పాలసీదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

10.సమష్టి కృషికి ఫలితమిది.. భారత్‌ విజయంపై దిగ్గజ క్రికెటర్ల స్పందన

ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0 తేడాతో కైవసం చేసుకున్నట్లయింది. పరుగుల పరంగా టెస్టుల్లో టీమ్‌ఇండియాకిదే భారీ విజయం కావడం గమనార్హం.

కెప్టెన్‌గా కోహ్లి ఖాతాలో అరుదైన ఘనత.!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని