Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 17 Feb 2024 21:02 IST

1. మే నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా ఫిబ్రవరి 19న విడుదల

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10గంటలకు తితిదే (TTD) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవాటికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మజూరవుతాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నరసరావుపేట నుంచి పోటీకి సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయలు

వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇటీవల ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబుతో ఆయన సమావేశమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నియోజవకర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కక్ష్యలోకి ఇన్సాట్‌-3డీఎస్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 వాహక నౌక .. ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2,275 కిలోల బరువు ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాకతీయ జూ పార్కుకు పెద్దపులి.. త్వరలో మరిన్ని ఆకర్షణలు

కాకతీయ జూ పార్కు (Kakatiya Zoological Park)కు త్వరలో కొత్త ఆకర్షణలు జత కానున్నాయి. జూలో సౌకర్యాలతోపాటు అదనంగా జంతువుల ప్రదర్శన పెంచాలని ఇటీవల మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏప్రిల్‌ 1 నుంచి జూలో పెద్దపులి, అడవి దున్న, మరో రెండు రకాల జింకలను (Hog deer and Barking deer) సందర్శకులకు అందుబాటులో ఉంచుతామని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎంసీ ఫర్గెయిన్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అన్నారం బ్యారేజీ మళ్లీ ఖాళీ.. దిగువకు నీటి విడుదల

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం (సరస్వతీ) బ్యారేజీలో నీటిని అధికారులు మళ్లీ ఖాళీ చేస్తున్నారు. గతంలో ఇదే బ్యారేజీలోని రెండు పియర్ల వద్ద బుంగలు, లీకేజీ గుర్తించడంతో.. ఆ సమయంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. మళ్లీ అదే సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో నీటిని తగ్గిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ

ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధులపై వడ్డీ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. 7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్‌పై సాధారణ డిపాజిటర్లు 3% కనీస వడ్డీ పొందుతారు. ఇదే డిపాజిట్‌పై సీనియర్‌ సిటిజన్స్‌ 3.50% వడ్డీ అందుతుంది. ఒక సంవత్సరం ఎఫ్‌డీపై డిపాజిటర్లు 6.70% పొందనుండగా, సీనియర్‌ సిటిజన్లు 7.20% వడ్డీ  అందుకుంటారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నావల్నీ మృతదేహం ఎక్కడ?

రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రతినిధి కిరా యార్మిష్‌ సైతం తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ నావల్నీ హత్యకు గురయ్యారని ఆరోపించారు. మరోవైపు ఆ మృతదేహం ఎక్కడ ఉందో ఇంకా తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సైన్యానికి తలొగ్గిన నవాజ్‌ షరీఫ్‌.. కుమార్తె కోసం రాజీ..!

పాకిస్థాన్‌ (Pakistan) రాజకీయాలను సైన్యం (Army) శాసిస్తుందనేది బహిరంగ రహస్యం. తాజాగా ఇది మరోసారి రుజువైంది. దేశ ప్రధానమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టాలని కలలు కన్న నవాజ్ షరీఫ్‌ (Nawaz Sharif) చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ప్రధాని పదవికి తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ను నామినేట్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: సీఈసీ

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ మాట్లాడారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప‘వార్‌’ వేళ.. వదిన x మరదళ్ల సవాల్‌ ఉంటుందా..?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ లోక్‌సభ నియోజకవర్గం ‘బారామతి’(Baramati)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శరద్ పవార్(Sharad Pawar) కుటుంబానికి పట్టున్న ఈ స్థానానికి ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో ఆమె సోదరుడు అజిత్‌ పవార్‌(Ajit Pawar) సతీమణి సునేత్ర( Sunetra Pawar) కూడా ఇక్కడినుంచే పోటీచేసే అవకాశాలున్నట్టు పలు వార్తా కథనాలు వెల్లడవుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని