Alexei Navalny: నావల్నీ మృతదేహం ఎక్కడ?

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతదేహం ఎక్కడ ఉందో ఇంకా తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated : 17 Feb 2024 20:54 IST

మాస్కో: రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ విమర్శకుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మరణించిన విషయం తెలిసిందే. ఆయన ప్రతినిధి కిరా యార్మిష్‌ సైతం తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. నావల్నీ హత్యకు గురయ్యారని ఆరోపించారు. మరోవైపు.. ఆ మృతదేహం ఎక్కడ ఉందో ఇంకా తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు నివాళులర్పించేందుకు స్మారక చిహ్నాల వద్దకు చేరుకుంటున్న వారిని అధికారులు కట్టడి చేస్తున్నారు. రష్యాలోని ఆయా నగరాల్లో ఇప్పటికే 100 మందికి పైగా పౌరులను అరెస్టు చేశారు.

‘‘స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.17 గంటలకు నావల్నీ చనిపోయినట్లు ఆయన తల్లికి అధికారులు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని సమీపంలోని సలేఖార్ద్‌ నగరానికి తరలించినట్లు తెలిపారు. ఓ న్యాయవాదితో కలిసి ఆమె సంబంధిత శవాగారాన్ని సందర్శించగా అది మూసి ఉంది. అధికారులు మాత్రం అది పని చేస్తోందని, మృతదేహం అక్కడే ఉన్నట్లు చెప్పారు. మార్చురీ సిబ్బందిని ఫోన్‌లో ఆరాతీయగా.. ఇక్కడ లేదని సమాధానం ఇచ్చారు. భౌతిక కాయాన్ని తక్షణం కుటుంబానికి అప్పగించాలి’’ అని కిరా యార్మిష్ ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్‌ చేశారు.

‘నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు’: తీవ్రంగా స్పందించిన బైడెన్‌

దర్యాప్తు పూర్తయ్యేవరకు మృతదేహాన్ని అప్పగించబోమని అలెక్సీ న్యాయవాదులకు ‘విచారణ కమిటీ’ సమాచారం అందించినట్లు యార్మిష్‌ తెలిపారు. అబద్ధాలాడుతూ.. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని అధికారులపై విమర్శలు చేశారు. నావల్నీ మృతిపై పశ్చిమదేశాల నుంచి వస్తోన్న విమర్శలను క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఖండించారు. వాటిని దారుణమైనవిగా పేర్కొన్నారు. అయితే మరణానికి గల కారణాలు వైద్యులు ఇంకా తేల్చలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని